
చీటీల పేరుతో మోసం..టీడీపీ నేతపై కేసు
యలమంచిలి రూరల్:చీటీలు,అధిక వడ్డీల ఆశచూపి పలువురి వద్ద భారీగా డబ్బు వసూలు చేసి, మోసం చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు దాడిశెట్టి పైడియ్య(నానాజీ)పై యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చీటీల ద్వారా 116 మంది రూ.64 లక్షలు మోసపోయినట్టు బాధితుడు తేటకలి భూషణరావు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదైంది. నిందితుడు పైడియ్య బాధితులు భారీగానే ఉన్నట్టు తెరువుపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.గ్రామంలో పాలసంఘంలో వేతన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడంతో తెరువుపల్లి,చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనను బాగా నమ్మి రూ.3కోట్లకు పైగా అప్పుగా ఇచ్చారు. ఇటీవల నిందితుడు కుటుంబంతో సహా గ్రామం నుంచి పరారవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.పరారైన నిందితుడు దాడిశెట్టి పైడియ్య(నానాజీ) కోసం పోలీసులు గాలిస్తున్నారు.అతని ఫోన్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు.