
టీడీపీలో ముసలం.!
● మునగపాక మండలంలో వర్గాలుగా చీలిపోయిన క్యాడర్ ● ఓ వర్గం జనసేన ఎమ్మెల్యే సుందరపుతో అంటకాగుతున్న వైనం ● నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ వైపు మరోవర్గం ● టీడీపీ మండల కమిటీల నియామకంతో రచ్చకెక్కిన నాయకులు ● ఆత్మీయ సమావేశం పేరిట మునగపాకలో ఓ వర్గం సమావేశం ● హాజరు కాని ప్రగడ, ఆయన అనుచరులు
మునగపాక: మునగపాక మండలం టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. ఇంత వరకు గుట్టుచప్పుడు కాకుండా పెరుగుతూ వచ్చిన అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబికింది. ఇందుకు పార్టీలో ఇటీవల నియమించిన నూతన కార్యవర్గాలే ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావుకు, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనుచరులుగా చెలామణి అవుతున్న టీడీపీ శ్రేణుల మధ్య గత కొంత కాలంగా విబేధాలు ఉన్నాయి. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు దాడి ముసిలినాయుడు, మొల్లేటి సత్యనారాయణ ఒక వర్గంగా ఉంటూ ఎమ్మెల్యే విజయకుమార్‌కు అనుచరులుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులుగా చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీలో ఇటీవల నూతన కమిటీల నియామకం చేపట్టారు. ఈ నియామకంలో భాగంగా మునగపాకకు చెందిన పెంటకోట విజయ్‌ను పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రకటించారు. ఎమ్మెల్యే అనుచరులుగా ఉంటున్న టీడీపీ నాయకులు ఈ నియామకాన్ని తట్టుకోలేకపోతున్నారు.
దీంతో శుక్రవారం మునగపాకలో శ్రీనివాసరావు, ముసిలినాయుడు, సత్యనారాయణ తదితరులు ఆత్మీయ సమావేశం పేరిట కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మొదటి నుంచి టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు కమిటీల్లో ఎలా నియామకాలు చేస్తారంటూ ఆవేదన వెల్లగక్కారు. కార్యకర్తల అభీష్టం మేరకు కమిటీల ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. నియోజకవర్గ టీడీపీ నేతలు కొంత మందిని ప్రోత్సహించేలా కమిటీల నియామకం చేపట్టారంటూ బాహాటంగా విమర్శలు గుప్పించారు. తాము ఎక్కడా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేయకున్నా తమను పక్కన పెట్టారని పలువురు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలంటే పార్టీలో నెలకొన్న విబేధాలను సరి చేయాలని, లేకుంటే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి అవకాశం ఇచ్చినట్లవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని, పెద్దలు జోక్యం చేసుకొని కార్యకర్తల అభీష్టం మేరకు కమిటీలు వేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులతో పాటు మంత్రి లోకేష్ దృష్టికి కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మొత్తమ్మీద మండల టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.