
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మునగపాక: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడని ఆశ పడిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. కశింకోట మండలం జోగారావుపేటకు చెందిన ప్రగడ రాజు,లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు చిరంజీవి(27) తన అమ్మమ్మ గ్రామమైన నారాయుడుపాలెంలో చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు. చిరంజీవి స్థానికంగా సీలింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తన స్నేహితుడు కేశెట్టి ధర్మరాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై నారాయుడుపాలెం నుంచి అనకాపల్లి వైపునకు వెళ్తుండగా తోటా–మూలపేట ఆర్చి సమీపంలో అనకాపల్లి నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనక కూర్చొన్న చిరంజీవి తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. బైక్ నడుపుతున్న ధర్మరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరితో సరదాగా ఉండే చిరంజీవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అటు జోగారావుపేట ఇటు నారాయుడుపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.