
సాహితీ సౌరభం
అనకాపల్లిలో అలరించిన శతాధిక కవి సమ్మేళనం
అనకాపల్లి: కళల కాణాచిగా పేరొందిన అనకాపల్లిలో సాహితీ సుగంధం పరిమళించింది. కవుల ఊహా ప్రపంచం.. వారి సామాజిక చైతన్యం సాహితీ ప్రియులను అలరించింది. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం శతాధిక కవి సమ్మేళనం వేడుకగా జరిగింది. స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో జరిగిన 139వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో 160మంది కవులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతోపాటు ఒడిశా రాష్ట్రం, చైన్నె, బెంగళూరు, ముంబయి పట్టణాల నుంచి వచ్చిన తెలుగు కవులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కవితలు వినిపించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేలా కవిత్వం ఉండాలన్నారు. అందుకోసం తమ సంస్థ ద్వారా తెలుగుభాష, సాహిత్యం విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంస్థ కన్వీనర్ కొల్లి రమావతి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పేద కవులకు చేయూత అందిస్తూ, పుస్తక ప్రచురణకు ఆర్థికంగా సహకరిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో త్వరలో పెద్ద ఎత్తున సాహితీ సంబరాలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ కె.కె.వి.నారాయణరావు ప్రసంగించారు. కళావేదిక జిల్లా అధ్యక్షుడు జి.ఎల్.ఎన్.శాస్త్రి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. 11 జిల్లాల కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారు.