గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు | Sakshi
Sakshi News home page

గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు

Published Sat, Dec 30 2023 2:06 AM

మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణ  - Sakshi

● ఎస్పీ కె.వి.మురళీకృష్ణ

నర్సీపట్నం : జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన శుక్రవారం రాత్రి నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా సబ్‌ డివిజన్‌లో ప్రధాన సమస్యలతో పాటు క్రైమ్‌ వివరాలను ఏఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత అనకాపల్లిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించామన్నారు. అల్లూరి జిల్లా నుండి రవాణా అవుతున్న గంజాయిని ఆరికట్టేందుకు ప్రస్తుతం 4 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మరో ఐదు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతంలో గంజాయితో పట్టుబడిన ఇద్దరిపై పీడీయాక్టు నమోదు చేశామన్నారు. అల్లూరి జిల్లాలో గతంలో 7,500 ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారన్నారు. ఎస్‌ఈబీ, పోలీసు సమన్వయంతో దీనిని నిర్మూలించామన్నారు. గంజాయి సాగు చేసే ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. గంజాయి రవాణాతో పాటు సారా నిర్మూలనపై ఎస్‌ఈబీ, పోలీసుల సమన్వయంతో ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. సారా తయారీ, రవాణా గల గ్రామాలు జిల్లాలో 346 ఉండేవన్నారు. ఆయా గ్రామాల్లో పోలీసులు దాడులు నిర్వహించి సారా తయారీ, రవాణా చేయకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 207 మందికి ప్రభుత్వం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. దీంతో 16 గ్రామాల్లో మాత్రమే సారా ప్రభావం ఉందన్నారు. తరచూ వాహనాల తనిఖీ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయటం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఎన్నికల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రౌడీషీటర్లలో పరివర్తన వచ్చేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీయాక్టు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. పోలీసుల కౌన్సెలింగ్‌ అనంతరం వారిలో మార్పు రాకపోతే బహిష్కరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement