ఆసియా పారా క్రీడల్లో విజేతకు ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

ఆసియా పారా క్రీడల్లో విజేతకు ఘన స్వాగతం

Published Sun, Nov 12 2023 1:32 AM

- - Sakshi

● షాట్‌పుట్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన రవికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఘన సన్మానం ● కె.కోటపాడు నుంచి స్వగ్రామం చిరికివానిపాలెం వరకూ ఊరేగింపుగా తీసుకువెళ్లిన గ్రామస్తులు

కె.కోటపాడు : చైనాలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో షార్ట్‌పుట్‌లో రవి వెండిపతకం సాధించడం హర్షణీయమని డిప్యూటీ సీఎం, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. గత నెల 24న జరిగిన ఆసియా పారా క్రీడల్లో షాట్‌ఫుట్‌లో వెండి పతకాన్ని సాధించిన రొంగలి రవి స్వగ్రామం చిరికివానిపాలెంకు శనివారం చేరుకున్నాడు. ఈ సందర్భంగా చిరికివానిపాలెం, వారాడ గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన రవికి కె.కోటపాడులో ఘనస్వాగతం పలికారు. కోలాట ప్రదర్శనతో పాటు గ్రామానికి చెందిన యువకులు కె.కోటపాడు నుంచి బైక్‌ర్యాలీతో సింగన్నదొరపాలెం, సూర్రెడ్డిపాలెం, ఎ.కోడూరు, వారాడ మీదుగా స్వగ్రామం చిరికివానిపాలేనికి రవిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హజరైన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు... రవికి దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహనికి డిప్యూటీ సీఎం బూడి, రొంగలి రవి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆసియా పారా క్రీడా పోటీల్లో వెండి పతకాన్ని సాధించిన రవి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చాడన్నారు. రాబోయే రోజుల్లో బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభ ఉంటే అంగవైకల్యం విజయాలకు అడ్డురాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్‌, వారాడ సర్పంచ్‌ గొర్రుపోటు సౌజన్య, వైస్‌ ఎంపీపీ లెక్కల నాగ విజయలక్ష్మి, ఉర సర్పంచ్‌ చిరికి గోవింద, వైఎస్సార్‌సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గొర్రుపోటు వెంకటరావు, లెక్కల గోపి, పాల సంఘం అధ్యక్షుడు దొగ్గ శివప్రసాద్‌, బొడ్డు దొరస్వామినాయుడు(లాయర్‌) పాల్గొన్నారు. కుమారుడు రవికి ఘనస్వాగతం లభించడంతో తల్లిదండ్రులు దేముడుబాబు, మంగ హర్షం వ్యక్తం చేశారు.

కె.కోటపాడు నుండి ర్యాలీగా రవిని తీసుకువెళ్తున్న గ్రామస్తులు
1/1

కె.కోటపాడు నుండి ర్యాలీగా రవిని తీసుకువెళ్తున్న గ్రామస్తులు

Advertisement
 
Advertisement