వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించను | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించను

Published Sun, Nov 12 2023 1:32 AM

అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో  హేమంత్‌  - Sakshi

● డీఎంహెచ్‌వో హేమంత్‌ హెచ్చరిక

దేవరాపల్లి: ప్రజలకు వైద్య సేవలందించడంతో అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎ.హేమంత్‌ హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమన్వయ లోపంతో పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది ఒకరిపై మరొకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ఎస్‌.లలిత, ఈ.పూజ్య మేఘన, సిబ్బందితో వేర్వేరుగా మాట్లాడి పీహెచ్‌సీలో పరిస్థితిపై ఆరా తీశారు. వారం రోజుల్లోగా మనస్పర్థలను వీడి అందరూ సమిష్టిగా విధులు నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది హెడ్‌ క్వార్టర్‌లోనే నివాసం ఉండాలని, లేకుంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీలో ఇప్పటికే నాడు–నేడు పథకంలో అభివృద్ధిపనులు చేపట్టగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో అదనపు భవనం నిర్మాణానికి రూ.1.8కోట్లు మంజూరయ్యాయని, పనులు సైతం జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా అదనపు భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

జిల్లాలో ఏడు కొత్త పీహెచ్‌సీ భవనాలు మంజూరు కాగా, ఆరు ఇప్పటికే పూర్తయి,ప్రారంభించామన్నారు. కె.కోటపాడు మండలం లంకవానిపాలెంలో పూర్తయిన పీహెచ్‌సీ భవనాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రారంభించనున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement