మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో గిరిజన మత్స్యకారులు ప్ర
మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో గిరిజన మత్స్యకారులు ప్రమాదకర పరిస్థితుల్లో చేపలవేట సాగిస్తున్నారు. దెబ్బతిన్ననాటు పడవలను వినియోగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఏటా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నా ఫైబర్ పడవలు మంజూరు కేవలం ప్రతిపాదనలకు పరిమితమైందని వాపోతున్నాయి. బోట్లు, వలలు పంపిణీ చేయడంతోపాటు ప్రమాద బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాయి. ● మత్స్యగెడ్డలో చేపల వేట సాగిస్తుండగా నాటు పడవలు ప్రమాదానికి గురై ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. సుజనకోట పంచాయతీ గొడుగులపుట్టు, బీట, వనుగుమ్మ పంచాయితీ దొమినిపుట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి.
● గత ఏడాది నవంబర్ నెల 6న సుజనకోట పంచాయతీ గొడుగులపుట్టు గ్రామానికి చెందిన పనసగూడియా సొంబ్రన్న(49) అనే గిరిజన మత్స్యకారుడు చేపలను వేటాడుతుండగా పడవ బోల్తా పడింది. రెండు రోజులపాటు గొడుగులపుట్టు, బీటా, గొడ్డిపుట్టు, వనుగుపుట్టు గ్రామాల గిరిజనులు నాటు పడవలపై గాలింపు చేపట్టారు.మూడు రోజుల తరువాత సొంబ్రన్న మృతదేహం కనిపించింది.
● సుజనకోట పంచాయతీ బీటా గ్రామానికి చెందిన సీసా జలంధర్ (44) అనే గిరిజన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి 24న నాటు పడవ బోల్తా పడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. నాటు పడవలపై గాలింపు చేపట్టగా మూడు రోజుల తరువాత మృతదేహం లభ్యమైంది.
● వనుగుమ్మ పంచాయతీ దొమినిపుట్టుకు చెందిన కిల్లో నర్సింగ్ (28) గిరిజన యువకుడు సెప్టెంబర్ 10న చేపలను వేటాడుతుండగా నాటు పడవ మునిగిపోయి గల్లంతయ్యాడు. స్థానిక గిరిజనులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వారం రోజులు గాలింపులు చేసినా లభ్యం కాలేదు. చాన్నాళ్ల తరువాత మత్స్యగెడ్డలో మృతదేహం కంటపడింది. ఇలావుండగా మరమ్మతులు చేపట్టిన పడవలను వినియోగించడం వల్ల బోల్తా కొట్టి ప్రమాదాలకు గురవుతున్నా అధికారుల్లో స్పందన కరువైందని గిరిజన మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
● మత్స్యగెడ్డ పరివాహిక గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించినప్పుడు బోట్లు, వలలు అందించాలని విన్నవించినా, హామీలతోనే సరిపెట్టారని గిరిజన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోట్లు, వలలు ఇవ్వడంతోపాటు ప్రమాద బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల, సుజనకోట, పెదగూడ, జోలాపుట్టు, వనుగుమ్మ, మాకవరం, దొడిపుట్టు, పనసపుట్టు, రంగబయలు పంచాయతీల్లోని 84 గ్రామాల మీదుగా మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 258 కుటుంబాలు చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరు 183 నాటు పడవలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ మరమ్మతులకు గురి కావడంతో భయంభయంగా వేట సాగిస్తున్నారు. వీటిలో అధికశాతం నాటు పడవల దిగువ భాగంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వీటిని మూసి వేసి వినియోగిస్తున్నారు. చేపలు వేటాడే సమయంలో రంధ్రాల ద్వారా పడవలోకి వస్తున్న నీటిని ఒకరు తోడుతుంటే.. మరొకరు చేపలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాటు పడవలు మునిగి ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. వీరు వినియోగిస్తున్న నాటు పడవల్లో 68 మరమ్మతుకు గురయ్యాయి.
పడవకు రూ.40 వేలు.. వలకు రూ.20 వేలు..
మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో గిరిజన మత్స్యకారులు నాటు పడవలు, వలలు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు.చెక్కలు, దుంగలు కొనుగోలు, పడవ తయారీకి రూ.30 వేల నుంచి రూ.40 కేటాయించాల్సి వస్తోందని వారు తెలిపారు. వల సైజును బట్టి పదివేల నుంచి 20వేల వరకు అవుతోందని, వీటిని ఒడిశాలోని చిత్రకొండ, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొనుగోలు చేస్తున్నామని గిరిజన మత్స్యకారులు పేర్కొన్నారు.
1/1
మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో గిరిజన మత్స్యకారులు ప్ర