పోలీసుల తనిఖీలతో నిలిచిన ట్రాఫిక్
రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయి అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు కార్యాలయాలకు, విద్యార్థులు కళాశాలలకు వెళ్లే సమయం కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడికి సమీపంలోని పందిరిమామిడి వద్ద, మారేడుమిల్లి రోడ్డులో భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పందిరిమామిడి సెంటర్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు వరకు, భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద 9 గంటల నుంచి సుమారు రెండు గంటలు పాటు తనిఖీలు నిర్వహించారు. మారేడుమిల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను శుక్రవారం చింతూరు పోలీసులు అడ్డగించి స్టేషన్‌లోనే ఉంచారు. సాయంత్రం వారిని తిరిగి వెనక్కి పంపించారు. అయితే ఢిల్లీ నుంచి కొంత మంది విద్యార్ధులు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకే పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టుగా స్థానికంగా ప్రచారం జరిగింది. ఒక వాహనంలో గంజాయి తరలిపోతుందని,అందుకే వాహనాలు తనిఖీ చేసినట్టు మరోకోణంలో కూడా వినిపించింది. అయితే పోలీసుల తనిఖీల్లో ఎటువంటివి పట్టుబడలేదు. సాధారణంగానే తనిఖీలు నిర్వహించినట్టు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.
ఇబ్బందులు పడిన వాహన చోదకులు
పోలీసుల తనిఖీలతో నిలిచిన ట్రాఫిక్


