బాగానే ఉన్న భవనం కూల్చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

బాగానే ఉన్న భవనం కూల్చేస్తారా?

Dec 2 2025 8:30 AM | Updated on Dec 2 2025 8:30 AM

బాగానే ఉన్న భవనం కూల్చేస్తారా?

బాగానే ఉన్న భవనం కూల్చేస్తారా?

వైజాగ్‌ పోర్టులో ఆధునికీకరణ పేరుతో

అడ్డగోలు నిర్ణయం

పాత భవనం బాగానే ఉన్నా..

కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి ప్లాన్‌

అంబేడ్కర్‌ భవనం కూల్చివేతకు

ప్రణాళికలు

తొలుత ఆధునికీకరణ పనులకు

మాత్రమే సన్నాహాలు

రూ.98 కోట్లను వృథా చేస్తారా అంటూ

ఉద్యోగుల విమర్శ

సాక్షి, విశాఖపట్నం: దాదాపు రెండు దశాబ్దాల కిందటి భవనమైనా.. చెక్కుచెదరలేదు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే, మరో ఇరవై ఏళ్లపాటు కార్యకలాపాల కోసం దర్జాగా వినియోగించుకోవచ్చు. దీనికి అనుగుణంగా అంచనాలు కూడా సిద్ధం చేశారు. కానీ, విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ అధికారులు మాత్రం ‘అబ్బే.. మాకు ఈ భవనం వద్దు. కొత్త హంగులతో నిర్మించుకోవాల్సిందే’అనుకున్నారు. అనుకున్నదే తడవుగా దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి, భారీ హంగులతో కొత్త భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. పోర్టుకు ఆదాయం తెచ్చిపెట్టే వ్యవస్థలను ఆధునికీకరించేందుకు ఈ నిధులను వినియోగించకుండా.. ఇలా భవనాల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ పోర్టు ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.

మరమ్మతులు వద్దు.. కొత్త భవనం కట్టేద్దాం!

రెండు భవనాలనూ కలిపి మరమ్మతులు చేసి కొత్త రూపం తీసుకురావాలని భావించిన అధికారులు, మరోసారి రహస్యంగా సమావేశమై ప్రణాళిక మార్చినట్లు తెలుస్తోంది. అంబేడ్కర్‌ భవనాన్ని పూర్తిగా పడగొట్టి, దాని స్థానంలో అత్యాధునిక హంగులతో కార్పొరేట్‌ తరహాలో మల్టీ స్టోరీడ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ను నిర్మించాలని కొందరు ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు భవనాల మరమ్మతులతో గిట్టుబాటు కాదనీ, ఒకే బిల్డింగ్‌ను నిర్మిస్తే సొంత లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో ఒక ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు పోర్టు వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న భవనాన్ని పూర్తిగా కూల్చివేసి, రూ. 98కోట్లతో కొత్త బిల్డింగ్‌ కట్టాలని బోర్డు ఆమోద ముద్ర వేసింది. అత్యాధునిక లిఫ్ట్‌లు, నాణ్యమైన ఫర్నిచర్‌తో ఇంటీరియర్‌ డిజైన్లతో కార్పొరేట్‌ తరహాలో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పరిపాలన భవనంలో నడుస్తున్న పోర్టు ఉన్నతాధికారుల విభాగాలను కొత్త భవనంలోకి మార్చాలని, ఆ తర్వాత పాత భవనాన్ని పోర్టు స్టేక్‌ హోల్డర్స్‌, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు లీజుకి ఇవ్వాలని యోచిస్తున్నట్లు పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రూ.98 కోట్ల పోర్టు ధనాన్ని వృథా చేస్తున్నారని, దీని బదులుగా పోర్టులో ఆధునికీకరణ పనులకు వెచ్చిస్తే ఆదాయ వనరులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. భవనం బాగానే ఉన్నా ఎందుకు కట్టాలనుకుంటున్నారో పోర్టు పెద్దలకే తెలియాలని, దీని వెనుక ఎలాంటి మతలబు దాగి ఉందో విజిలెన్స్‌ దర్యాప్తు జరిగితే బట్టబయలవుతుందని పోర్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అసలు ప్రణాళిక ఏంటి?

విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ పరిపాలన భవనం పక్కనే డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ భవనం ఉంది. ఇది గతంలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) ప్రధాన కార్యాలయంగా ఉండేది. డీసీఐ సీతమ్మధారలోని కార్పొరేట్‌ భవనానికి తరలి వెళ్లినప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా ఉంది. ఇటీవల పోర్టులోని ఇన్వెస్ట్‌మెంట్‌ అప్రైజల్‌ కమిటీ సమావేశమై.. ఈ బిల్డింగ్‌కు ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేట్‌ లిమిటెడ్‌(ఎన్‌బీసీసీ) ఇండియా సహకారంతో ఈ పనులు నిర్వహించి, ప్రస్తుతం దూరంగా ఉన్న ట్రాఫిక్‌ మేనేజర్‌ కార్యాలయాన్ని ఇందులోకి తరలించాలని భావిస్తోంది. కేవలం అంబేడ్కర్‌ భవనమే కాకుండా, పక్కనే ఉన్న పరిపాలన భవనం కూడా ఆధునికీకరించేందుకు సుమారు రూ. 80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement