శాస్త్రోక్తంగా మార్గశిరరాట మహోత్సవం
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశా ఖ వాసుల ఆరాధ్యదైవం కనకమహాలక్ష్మి అమ్మ వారి మార్గశిర మాసోత్సవాల రా ట పూజా కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేసి మార్గశిర మాసోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం ప్రకారం శనివారం ఉదయం 10.53 గంటలకు నాదస్వర సుస్వారాలు, వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు అమ్మవారి జాకెట్టు ముక్క, తాంబూలం, గాజులు, ప్రసాదం అందజేశారు. ఇప్పటి నుంచి కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలకు విస్త్రత ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో కె.రాజేంద్రకుమార్, కార్పొరేటర్లు, భక్తులు పాల్గొన్నారు.


