ఆలయాల్లో ఆగని మృత్యుఘోష
ఇంకా కళ్లముందే తిరుపతి,సింహాచలం ఘటనలు
తాజాగా కాశీబుగ్గ ఘటనతో భక్తుల్లో ఆందోళన
ప్రత్యేక రోజుల్లో భక్తుల భద్రత ప్రభుత్వానికి పట్టదా అంటూ మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: గుడికి వెళ్లి దండం పెట్టుకునేలోపే.. కొందరు దేవుడి దగ్గరికే వెళ్లి పోతున్నారు. భగవంతుడి దర్శనం, దీపదర్శనం చేసుకున్న రోజే.. వారి ఇంట చితి మంటలు వెలిగే రోజుగా మారుతోంది. దైవనామ స్మరణ వినిపించాల్సిన ఆలయాల్లో.. ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీతో కళకళలాడాల్సిన ఆలయాలు.. తొక్కిసలాటలు, గోడ కూలిన ఘటనలతో భయాందోళన కలిగిస్తున్నాయి. మొన్న పవిత్ర తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో జరిగిన తొక్కిసలాట, నిన్న సింహాచలం చందనోత్సవ ఘటనలు కళ్లముందే మెదులుతుండగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో భక్తజనం ఉలిక్కిపడుతోంది.
సింహగిరిపై గోడ కూలి ఏడుగురు మృతి
ఈ ఏడాది ఏప్రిల్ 30న సింహాచలం చందనోత్సవం వేళ.. నృసింహుని నామస్మరణతో మారుమోగాల్సిన సింహగిరిపై హాహాకారాలు మిన్నంటాయి. సింహాచలేశుని దర్శించుకుని తరించాలనుకున్న భక్తులు.. స్వామి నిజరూప దర్శనం కాకమునుపే ఆలయ ప్రహరీ కూలిన ఘటనలో ఏడుగురు నిర్జీవులుగా మారారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని విషాదంలో నెట్టింది. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ అప్పుడు ప్రభు త్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ మాట చెప్పి ఏడు నెలలైనా గడవక ముందే.. మరో ఆలయం మృత్యు ద్వారాలు తెరిచింది. పవిత్రమైన కార్తీక ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని కలియుగ వేంకటేశ్వరుని దర్శించుకోవాలని వచ్చిన భక్తులు.. తొక్కిసలాటలో చిక్కుకుని మృత్యుఒడికి చేరుకున్నా రు. ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రత్యేక రోజుల్లో భక్తుల భద్రత పట్టదా?
ఇలా శుభ దినాల్లో స్వామిని దర్శించుకునేందుకు ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడాల్సిన దుస్థితి దాపురించింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడే ప్రభుత్వం మేల్కొని.. రాష్ట్రంలోని చిన్నా పెద్దా అన్ని ఆలయాల వద్ద ముఖ్యమైన పండగలు, శుభదినాల సమయంలో రద్దీని అంచనా వేసి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు, భద్రతపై దృష్టిసారించాల్సింది. కానీ.. ఘటన జరిగిన కొద్ది రోజులకే కూటమి ప్రభుత్వం అంతా మరిచిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బయటపడి. సింహాచలం చందనోత్సవంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఆ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఆలయాల్లో హడావిడి చేసిన యంత్రాంగం.. ఆ తర్వాత అంతా గాలికి వదిలేసింది. ఇప్పుడు మరోసారి అమాయక భక్తులు బలయ్యారు.
ముందస్తు చర్యలు శూన్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాశీబుగ్గ ఘటన మూడో పెద్ద దుర్ఘటన. ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు భక్తులు ఊహించని రీతిలో వస్తుంటారు. దాని ప్రకారం ముందస్తు అంచనాలు వేసి, ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొన్ని ప్రైవేట్ ఆలయాలకూ భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇవేమీ పట్టనట్లుగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా.. తరచూ విషాద ఘటనలకు ఆలయాలు కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. కార్తీక మాసం, మార్గశిర మాసాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆలయంలోనూ భద్రత, ఏర్పాట్లపై సమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు.


