హత్య చేసి.. స్వామి అవతారమెత్తి..
అల్లిపురం: ఒక హత్య కేసులో నిందితుడు.. చట్టం కళ్లుగప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరకకుండా ఏకంగా హిమాలయాలకు వెళ్లి.. భైరవ స్వామిగా అవతారమెత్తాడు. కాశీ, కేదార్‌నాథ్‌లో నాగసాధువులతో కలిసి తిరుగుతూ.. తన గతాన్ని పూర్తిగా చెరిపేశాననుకున్నాడు. కానీ విశాఖ టూటౌన్ పోలీసులు పక్కా వ్యూహంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఈ దొంగ స్వామి గుట్టును రట్టు చేశారు. శనివారం నగరంలో అడుగుపెట్టిన అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు.
గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో హత్య చేసి..
నగరంలోని కల్లుపాకలో నివసిస్తున్న ఇసుకతోటకు చెందిన పిచ్చేటి యుగంధర్ (39) అలియాస్ రాఘవపై 2021లో ఒక హత్య కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో యుగంధర్ హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టయిన అతను కొన్నాళ్లకు బెయిలపై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా ఉంది. నగరంలో రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ అతనిపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో.. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆపరేషన్ భైరవ
డీసీపీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో, ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు, ఎస్‌ఐలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని యుగంధర్ ఆచూకీ కోసం గాలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యుగంధర్ తన రూపురేఖలు మార్చుకుని.. ఏకంగా హిమాలయాలకు మకాం మార్చినట్లు తేలింది. కాశీ, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో ‘భైరవ స్వామి’పేరుతో నాగసాధువులతో కలిసి తిరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. తరచూ తన నివాసాన్ని మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు.
పక్కా స్కెచ్‌తో అరెస్ట్
అయినా పోలీసులు తమ నిఘాను మరింత పటిష్టం చేశారు. యుగంధర్ సన్నిహితుల కదలికలపై సాంకేతిక నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో యుగంధర్ శనివారం నగరానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ టీమ్.. రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్ వద్ద మాటు వేసింది. భైరవ స్వామి అవతారంలో, మారువేషంలో సంచరిస్తున్న యుగంధర్‌ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్లుగా చట్టానికి దొరక్కుండా.. స్వామీజీ వేషంలో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న టూటౌన్ సీఐ ఎర్రంనాయుడు, అతని సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
భైరవ స్వామిఅవతారంలోనిందితుడు యుగంధర్
యుగంధర్‌అసలు రూపం
హత్య చేసి.. స్వామి అవతారమెత్తి..
హత్య చేసి.. స్వామి అవతారమెత్తి..


