
వైద్యం అందక బాలుడి మృతి
ఎటపాక: పీహెచ్‌సీలో వైద్యులు లేక సకాలంలో వైద్యం అందక ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం లక్ష్మీపురం పీహెచ్‌సీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...బండిరేవు గ్రామానికి చెందిన నూపా రాజేష్ కుమారుడు జయదేవ్(6) గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే బుధ వారం సాయంత్రం బాలుడికి వాంతులు, ఫిట్స్ రావడంతో సమీపంలోని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ఆసమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో ఏఎన్‌ఎం, సిబ్బంది ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆమె సూచనల మేరకు బాలుడికి వైద్యం చేసినట్లు తెలిసింది.ఈక్రమంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో 108కు సమాచారం ఇచ్చారు.అయితే మండలంలో 108 సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో పక్క మండలం నుంచి వాహనం వచ్చే సరికి బాలుడు మృతి చెందాడు. రెండు గంటల పాటు ఆస్పత్రిలోనే ఉంచారని సకాలంలో వైద్యం అందించి ఉంటే బాలుడు బతికేవాడని బాధితులు రోదించారు.