
ప్రభుత్వ పాఠశాలల్లో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ’ ని
సాక్షి, పాడేరు : మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ నిర్వహణ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలను గురువారం అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ నిధుల సమస్య నెలకొంది. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రియల్ టైమ్ గ్రేస్ పేమెంట్ కింద నిధులు జమ అవుతాయని ఉపాధ్యాయులు భావించారు. అయితే బుధవారం సాయంత్రం వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాలేదు. ప్రతీ పాఠశాల, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణకు రూ.6నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతుంది. సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులు, వారి పిల్లలకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం స్నాక్స్,టీ, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వీటన్నింటిని ఉపాధ్యాయ వర్గాలు కొనుగోలు చేశాయి. అలాగే టెంట్లు, కుర్చీలను కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఖర్చులు అధికంగా ఉంటుండడంతో ఆ సొమ్మంతటిని ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్థికంగా నష్టపోతామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో వార్డెన్లు, మేట్రిన్లకు కూడా చేతిచమురు వదిలేటట్టు లేదు. తల్లిదండ్రుల సమావేశాలతో ఉపాధ్యాయులు హైరానా పడుతున్నారు. జిల్లాలోని 2,895 పాఠశాలల్లో ఒకటి నుంచి 10వతరగతి వరకు 1.70 లక్షల మంది, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్టు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి.
మౌలిక సౌకర్యాలను పక్కనబెట్టి..
మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులకు తలనొప్పి తెస్తోంది. బడులు తెరిచి నెల రోజులు కావస్తున్నా ఏ పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో యూనిఫామ్, షూస్, బెల్ట్‌లు, పుస్తకాలు అందించలేదు. కొద్ది మందికి యూనిఫామ్స్ మాత్రమే అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఇప్పటికే వివిధ కారణాలతో తల్లికి వందనం ఆపేయడంతో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు చదువు కన్నా ప్రచార ఆర్భాటాల కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మొన్న యోగాంధ్ర పేరుతో వారం రోజుల పాటు చదువులకు దూరం అయ్యారని, ఇప్పడు పనికి రాని మీటింగ్‌లతో వారం రోజలు చదువులు చెప్పడం లేదని వారు వాపోతున్నారు.
మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్
నిర్వహణకు నిధుల కొరత
ఆర్భాటంగా నిర్వహించాలని ఆదేశాలు
ఉపాధ్యాయులకు తప్పని చేతిచమురు
నిధులు ఊసెత్తని కూటమి సర్కారు