
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
చింతూరు/వీఆర్‌పురం: వరదలు సంభవిస్తే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే దానిపై ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం చింతూరు, వీఆర్‌పురం మండలాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాయి. వీఆర్‌పురం మండలం చింతరేగుపల్లిలో వరదనీరు గ్రామాల్లోకి వస్తే అప్రమత్తంగా ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చింతూరు ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్‌తో కలసి చింతూరు, వీఆర్‌పురం శబరినది వంతెనలను పరిశీలించారు. వరదలు వస్తే ప్రజలను తరలించేందుకు ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలను కూడా పరిశీలించారు. గ్రామాల్లోకి వరదలు వస్తే వెంటనే ప్రజలను ఇళ్లు ఖాళీచేయించి పునారావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వరదల సమయంలో సమాచారం నిమిత్తం చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 8121729228 9490026397 నంబర్లు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. వరదలకు సంబంధించిన ముందస్తు రేషన్ స్టాకును ఆయా పాయింట్లకు తరలించాలని, అన్ని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో అత్యవసర మందులు అందుబాటులో వుంచాలని, పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, రహదారి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌పురం మండలానికి చెందిన తహసీల్దార్ సరస్వతి, ఎంఈవో లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.