వెదురు సోయగం

విశాఖ నగరంలో కొలువుదీరనున్న వెదురు ఆకృతుల్లో పూల సోయగాలు - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అందాల విశాఖలో వెదురు సోయగాలు కనువిందు చేయనున్నాయి. జీ–20 దేశాల సదస్సుకు వచ్చే అతిథులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు విశాఖ నగరం ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకోసం నగరం ముస్తాబవుతోంది. పర్యావరణహిత వెదురుతో మోడరన్‌ బాస్కెట్లు, బ్యాంబూ పోల్స్‌, బ్యాంబూ తబలాల ఆకృతితో వీటిని వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో తయారు చేయిస్తున్నారు. అక్కడ వెదురు ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం ఉన్న వారితో వీటిని వినూత్నంగా రూపొందిస్తున్నారు. వీటిపై అందంగా పూసే పూల మొక్కలను అమర్చనున్నారు. వీటిని ఆర్కే బీచ్‌లోని నోవోటెల్‌ హోటల్‌ నుంచి రుషికొండ సమీపంలో ఉన్న జీ–20 సదస్సు జరిగే ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ ప్రాంతం వరకు రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మధ్యలోని డివైడర్ల పైన, బీచ్‌రోడ్డులోని ఫుట్‌పాత్‌ల పైన ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 500 వరకు బ్యాంబూ బాస్కెట్లు, 50కి పైగా తబలాలు, 200 వరకు బ్యాంబూ పోల్స్‌ ఉండనున్నాయి. ఇవి కాకుండా మరో వెయ్యి వరకు వెదురు ఫ్లవర్‌ వాజ్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర బ్యాంబూ మిషన్‌, మేదరి హ్యాండీ క్రాఫ్ట్‌స్‌ అండ్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ద్వారా వీటన్నిటినీ తయారు చేస్తున్నారు. గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో వీటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వెదురు ఉత్పత్తులను మైదుకూరు నుంచి సింహాచలం నర్సరీ వద్దకు తీసుకొచ్చారు. రవాణాలో కొన్నింటి వార్నిష్‌లు పాడయ్యాయి. అలాంటి వాటికి మళ్లీ వార్నిష్‌లు వేస్తున్నారు. నేడో, రేపో వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

పూణే, కడియంల నుంచి పూలమొక్కలు

వెదురు ఆకృతులపై ఏర్పాటు చేసే ప్రత్యేక రకాల పూల మొక్కలను (ఫ్లవరింగ్‌ ప్లాంట్స్‌) పూణే, కడియం నర్సరీల నుంచి రప్పిస్తున్నారు. వీటిని అమర్చాక పూలు వికసిస్తాయి. అవి నాలుగైదు రోజుల పాటు వాడిపోకుండా ఉంటాయి. నోవోటెల్‌–రాడిసన్‌ బ్లూ హోటళ్ల మధ్య బీచ్‌ రోడ్డులో విదేశీ ప్రతినిధుల రాకపోకలుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని వెదురు ఆకృతులపై అమర్చిన పూల మొక్కలు ఈ ప్రతినిధులను ఆకట్టుకోనున్నాయి. ఉగాది సందర్భంగా తాడేపల్లిలోని సీఎంఓ వద్ద ఇలాంటి వాటినే ఏర్పాటు చేశారు. అవి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఎందరినో అలరించాయి.

ఈ తరహా ఇదే తొలిసారి..

ఇప్పటివరకు దేశంలోని త్రిపుర, అస్సాం, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలల్లోనే ఈ తరహా వెదురు ఆకృతులు తయారవుతున్నాయి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వీటిని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర మేదర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాఘవేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. మైదుకూరులో మూడు వారాల నుంచి వీటి తయారీలో నైపుణ్యం ఉన్న మేదరులు రేయింబవళ్లు శ్రమించి వీటిని రూపొందిస్తున్నారని చెప్పారు. జీ–20 సదస్సు ముగిశాక మళ్లీ వీటిని భద్రపరచుకోవచ్చు. మూడు, నాలుగేళ్ల పాటు ఇవి చెక్కు చెదరవు. అందువల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులు జరిగినప్పుడు మళ్లీ వీటిని బ్యూటిఫికేషన్‌ కోసం ఉపయోగించుకోవచ్చని గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ రాజశేఖర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వెదురు పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దీంతో మున్ముందు వెదురుకు కొరత ఏర్పడదని, పర్యావరణ హిత వెదురుతో అనేక రకాల ఆకృతులను విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు.

జీ–20కి వెదురుతో ఆకృతులు

మైదుకూరులో రూపుదిద్దుకున్న బాస్కెట్లు, పోల్స్‌, తబలాలు

ఇప్పటికే నగరానికి చేరుకున్న బ్యాంబూ ఉత్పత్తులు

వీటిపై పూణే, కడియంల నుంచి రప్పిస్తున్న పూలమొక్కలు

విశాఖ రోడ్లకిరువైపులా విరబూయనున్న అందాలు

ఈ తరహా రాష్ట్రంలో ఇదే తొలిసారి




 

Read also in:
Back to Top