మాచ్‌ఖండ్‌లో పుష్ప–2 షూటింగ్‌?

- - Sakshi

● లొకేషన్లను నిర్ణయించిన అసిస్టెంట్‌ డైరెక్టర్లు ● ఏప్రిల్‌ రెండో వారం నుంచి చిత్రీకరణ జరిగే అవకాశం

సాక్షి, పాడేరు: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ పుష్ప ప్రేక్షకులను ఎంతో అలరించింది. అప్పట్లో పుష్ప సినిమాలో పలు సన్నివేశాలను జిల్లాలోని మారేడుమిల్లి, సీలేరుతో పాటు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం పుష్ప–2 చిత్రం కోసం లొకేషన్లు చూసేందుకు ఆ చిత్ర అసిస్టెంట్‌ డైరెక్టర్లు, చిత్ర నిర్మాణ ప్రతినిధులు మూడు రోజుల నుంచి జిల్లా సరిహద్దు, ఒడిశాలోని అటవీ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పరిధిలోని దట్టమైన అడవితో పాటు డుడుమా జలపాతం, మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి చెందిన వించ్‌ మార్గం, వ్యూపాయింట్లు, బలిమెల జలాశయానికి వెళ్లే సెలయేరు, అడవిలోని బొండా జాతి గిరిజన గ్రామాలను పరిశీలిస్తున్నారు. మాచ్‌ఖండ్‌లో పుష్ప–2కు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, ప్రకృతి అందాలను వీడియో, ఫొటోల రూపంలో దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌లకు అందడంతో వారు కూడా ఇక్కడ అందాలకు ఫిదా అయినట్టు సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఆంధ్రా సరిహద్దు, ఒడిశా ప్రాంతాల్లో పుష్ప–2 సినిమా షూటింగ్‌ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.




 

Read also in:
Back to Top