గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే ఉత్తర్వులు

మారేడుమిల్లి: స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల(పీటీజీ) ప్రిన్సిపాల్‌ ఎస్‌కే అహ్మద్‌ అలీషా సస్పెండ్‌ చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలాఉన్నాయి. గురుకుల పాఠశాలలో ఏడోవ తరగతి చదువుతున్న విద్యార్థి సాదల లోకేశ్వరరెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌ ఆరున అనారోగ్యానికి గురయ్యాడు. అతనిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. అయితే తల్లిదండ్రులు ఒత్తిడి మేరకు అతనిని వారికి అప్పగించి స్వగ్రామమైన వై.రామవరం మండలం ఎడ్లకొండ గ్రామానికి పంపించారు. ఆ తరువాత ఏడవ తేదీన లోకేశ్వరరెడ్డి ఇంటి వద్ధ మృతి చెందాడు. దీనిపై ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే విచారణకు అదేశించారు. విచారణలో భాగంగా అనారోగ్యంతో ఉన్న లోకేశ్వరరెడ్డిని వైద్యులు రంపచోడవరం రిఫర్‌ చేసినప్పటికీ అతనిని రంపచోడవరం ఆస్పత్రికి పంపించకుండా తల్లిదండ్రులకు అప్పగించిన కారణంగా ప్రిన్సిపాల్‌ ఆహ్మద్‌ అలీషాను సస్పెండ్‌ చేస్తూ ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం ఏపీఆర్‌ పాఠశాలకు చెందిన టి. అరుణ కుమారికి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఏపీ అధ్యక్షుడు బాలు అక్కిస మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్యం బాగోలేనప్పుడు వారి బాధ్యతలు సంబంధిత ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ తీసుకుని సకాలంలో వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని జాతీయ కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు.




 

Read also in:
Back to Top