కొలువుదీరిన దుర్గమాంబ

దుర్గమాంబను ఆలయంలో ప్రతిష్టించడానికి ఊరేగింపుగా తీసుకువెళుతున్న భక్తులు - Sakshi

పరవాడ: ఈ.బోనంగి శివారు బొద్దపువానిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గమాంబ విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవ మహోత్స వం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయాన్ని పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం శ్రీదుర్గమాంబను భక్తుల దర్శనార్థం గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేదపండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నడుమ రేవతి నక్షత్రయుక్త, వృషభ లగ్నమందు ఉదయం 9.57 గంటలకు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ దేవతకు భక్తులు పసుపు కుంకుమలు, సారే, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా చిడతలు, తప్పెడుగుళ్లు, సాముగరిడి లు, నేల డ్యాన్సులు నిర్వహించారు. భారీ ఎత్తున బాణసంచాను కాల్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

దుర్గమాంబను దర్శించుకొన్న నాయకులు

గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గమాంబను ఈ.బోనంగి సర్పంచ్‌ బొద్దపు శ్రీనివాసరావు, రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, పరవాడ జెడ్పీటీసీ పి.ఎస్‌.రాజు, పరవాడ సర్పంచ్‌ సిరపరపు అప్పలనాయుడు, ప్రముఖులు చుక్క రామునాయుడు, పైల జగన్నాథరావు, మాసవరపు అప్పలనాయుడు, బొద్దపు నూకరత్నం, బొద్దపు వెంకటరమణ, బొద్దపు చిన్నారావు, మేడిశెట్టి బాలాజీ నాయుడు, పలువురు గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శించుకొన్నారు. ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.




 

Read also in:
Back to Top