అప్పన్నకు శాస్త్రోక్తంగా స్వర్ణపుష్పార్చన

గరుడసేవ నిర్వహిస్తున్న పురోహిత్‌ అలంకారి సీతారామాచార్యులు, పాల్గొన్న భక్తులు  - Sakshi

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు ఘనంగా జరిగాయి. ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు స్వర్ణ పుష్పార్చనని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ పుష్పాలతో స్వామికి అష్టోత్తర శతనామావళిని నిర్వహించారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు కె.కె.ప్రసాదాచార్యులు, అర్చకుడు శ్రీకాంత్‌ తదితరులు ఈసేవను నిర్వహించారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వైభవంగా నిత్య కల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం 9.30గంటల నుంచి 10.30గంటల వరకు శ్రీ వరాహ నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కల్యాణమంపడంలోని వేదికపై వేంజేంప జేశారు. విష్వక్సేణపూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు ,ప్రసాదాన్ని అందజేశారు.

ఘనంగా గరుడసేవ

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేంపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు వారణాసి దినేష్‌రాజ్‌ ఈపూజలో పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top