20 వేల ఎకరాలు

సిరిమెట్ల సమీపంలో ప్రవహిస్తున్న కన్నేరు వాగు   - Sakshi

● దుమ్ముకొండ, కన్నేరు వాగులపై నిర్మాణం ● ప్రతిపాదనలు రూపొందిస్తున్న అధికారులు ● ఐదు మండలాల రైతులకు ప్రయోజనం

గన్నవరం సమీపంలో ప్రవహిస్తున్న దుమ్ముకొండ వాగు

వై.రామవరం: మండలంలో ఎత్తయిన కొండల్లో దుమ్ముకొండ ఒకటి. మండల కేంద్రానికి అతి సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ కొండ విస్తరించి ఉంది. దీనిపై ఏడాది పొడవునా జీవనదిలా ప్రవహించే జలధార నీరు వృథా అవుతోంది. ఇది రెండు వాగులుగా విడిపోయి ప్రవహిస్తోంది. మండలంలోని గ్రామాల మీదుగా ప్రవహించే దీనిని దుమ్ముకొండ వాగుగా, కోట శివారు సిరిమెట్ల గ్రామ సమీపంలో ప్రవహించే దానికి కన్నేరు వాగుగా పిలుస్తుంటారు. మండలంలో ఈ రెండు వాగులు మండు వేసవిలో సైతం నిండుగా ప్రవహిస్తుంటాయి. ఈ నీటిని సాగుకు అనువుగా మార్చగలిగితే ఐదు మండలాల రైతులకు ఇబ్బందులు తప్పుతాయని పలువురు సూచిస్తున్నారు. మండలంలో సాగునీటి ప్రాజెక్ట్‌లు లేకపోవడం వల్ల రైతులు వర్షాధారంపై ఆధారపడాల్సి వస్తోంది. దుమ్ముకొండ, కన్నేరువాగుపై సాగునీటి ప్రాజెక్టులను నిర్మించగలిగితే మండలంతో పాటు సరిహద్దు ప్రాంతాలైన అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన 20 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది.

వీటిపై సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ఎటువంటి ముంపు సమస్య ఉండదు. అటవీప్రాంతంలోనే నీరు నిల్వ ఉంటుంది. పరిసర గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉండదని పరిసర గ్రామాల ప్రజలు చెబుతున్నారు. రెండు కొండలు ఉన్నందున వాటి మధ్య తక్కువ నిధులతో ప్రాజెక్ట్‌ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మినీ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్టు నిర్మాణానికి అనువుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.




 

Read also in:
Back to Top