ఫుల్‌ స్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఫుల్‌ స్టాక్‌

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

● అందుబాటులోకి పత్తి విత్తన ప్యాకెట్లు ● మార్కెట్లో డిమాండ్‌ కంటే అధికంగా.. ● కొన్ని రకాల సీడ్‌ కోరితేనే సమస్య ● సమీపిస్తున్న వానాకాలం సీజన్‌

సాక్షి,ఆదిలాబాద్‌: వానాకాలం సాగు సీజన్‌ వచ్చిందంటే జిల్లాలో మొదట చర్చకు వచ్చేది పత్తి విత్తనాలే. అయితే అనేక రకాల కంపెనీల ప్యాకెట్లు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయని, కొరత సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితే ఉండదని ఏటా వ్యవసాయ శాఖ చెబుతోంది. తీరా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదురవుతాయి. రైతులు అధికంగా నాలుగు కంపెనీల సీడ్‌ మాత్రమే కావాలని అడుగుతారు. అవి డిమాండ్‌ మేర ఇచ్చే పరిస్థితులు ఉండవు. దీంతో వాటి కోసం వేకువజామునే దుకాణాల ఎదుట బారులుతీరడం, ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పడం ఏటా జిల్లాలో ఆనవాయితీగా మారింది. ఈ సీజన్‌లో జిల్లాలో అన్ని పంటలు కలిపి సుమారు 5లక్షల 91వేల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 70 శాతానికి పైగా పత్తి సాగు కానుంది. ఈ ప్రాంత రైతులు తెల్లబంగారాన్ని నమ్ముకొని తేటా వానాకాలంలో పత్తిని పెద్ద ఎత్తున సాగు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌ సమీపిస్తుంది. మృగశిరకార్తె ప్రవేశంతో పాటు వానలు మంచిగా కురిసిన పక్షంలో రైతులు జూన్‌ రెండో వారంలోనే పెద్ద ఎత్తున విత్తనాలు విత్తేందుకు అవకాశం ఉంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో నాణ్యమైన లాంగ్‌స్టాపిల్‌ పత్తి దిగుబడి అవుతుంది. పొడవైన దారాలు కలిగిన పత్తిని లాంగ్‌స్టాపిల్‌గా పరిగణిస్తారు. ఇది మృదువైన, మన్నికై న, నాణ్యమైన వస్త్రాలను తయారీకి ఉపయోగపడుతుంది. లాంగ్‌స్టాపిల్‌ ధరనే జిల్లాలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.557లు అధికంగా పెంచారు. లాంగ్‌స్టాపిల్‌ పత్తి క్వింటాలుకు రూ.8,667 ధర నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పత్తి విస్తీర్ణం మరింత పెరుగుతుందా.. లేనిపక్షంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సిందే.

ఈ వానాకాలం సీజన్‌లో..

పత్తి సాగు విస్తీర్ణం అంచనా

: 4లక్షల 25వేల ఎకరాలు

అవసరమయ్యే విత్తన ప్యాకెట్లు : 10లక్షల 66వేలు (450 గ్రాములు)

విత్తన కంపెనీల వద్ద లభ్యత

: 19లక్షల ప్యాకెట్లు

వైరెటీల సంఖ్య : 60

Advertisement
 
Advertisement
Advertisement