ఓట్లన్నీ మనకే పడాలే..
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఏ ఊరికెళ్లినా గ్రామ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. తొలి, మలి విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నిన్న, మొన్నటి వరకు చూసీచూడనట్లు పట్టించుకోకుండా వెళ్లిన వారు ప్రస్తుతం ఓటర్లను ఆపి మరీ పలకరిస్తున్నారు. లేని పోని ప్రేమలు ఒలకబోస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. తమను సర్పంచ్‌గా గెలిపిస్తే మీరు అడిగిన పనులన్నీ చేసి పెడుతామని హామీ ఇస్తున్నారు. ఇంట్లోని ఓట్లన్నీ వేయాలని కోరుతున్నారు. అందుకు ఏం చేయమన్నా చేస్తామని నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టి ప్రచారం జో రుగా సాగిస్తే గెలుపు సునాయసమవుతుందనే ఉద్దేశంతో వారిని మందు, విందులతో ముంచెత్తుతున్నారు. అందుకు అవసరమైన డబ్బులను ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నారు. క్రీడా కిట్లు అందిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చులన్నింటినీ సమకూర్చుతామని వారిని మచ్చిక చేసుకుంటున్నారు. మహిళల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇంట్లోని ఓట్లన్నీ మనకే వస్తాయనే ధీమాతో వారి అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. అలాగే తమతమ సామాజికవర్గాల ఓటర్ల పై గురి పెడుతున్నారు. గంపగుత్తగా ఓట్లు రాబట్టుకుంటే గెలుపు ఖాయమనే భావనతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో పలుకుబడి కలిగిన పెద్ద మనుషులను మధ్యవర్తులుగా ఉంచి తమ సామాజిక ఓటర్లకు గాలం వేస్తున్నారు. వారికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓట్లన్నీ పడాలంటూ వారడిగినంత ముట్టజెబుతున్నారు. ఆలయాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు తమవంతు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. తమను గెలిపిస్తే భవిష్యత్‌లో ఏం కావాలన్నా చేసి పెడతామని భరోసానిస్తున్నారు. ఇలా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా తమ చేతిచమురు వదిలించుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు బరిలో ఉంటామని చెబుతూ వచ్చిన అభ్యర్థులు గుర్తులు ఖరారు కావడంతో వాటిని ఓటర్ల వద్దకు చేర్చి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబీకులూ గ్రామంలోని ప్రతీ ఇంటిని పలుసార్లు సందర్శిస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓట్లు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఎవరి మద్దతు కూడగడితే మెజార్టీ ఓట్లు తమకు వస్తాయంటూ జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. దీంతో పల్లెల్లో పంచాయతీరాజకీయ ప్రచారపర్వం జోరుగా సాగుతోంది.


