● రేపటి నుంచి పాఠశాలలకు ప్రత్యేక బృందాలు ● రికార్డులు,
ఆదిలాబాద్‌టౌన్:సర్కారు బడుల బలోపేతానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పజెప్పింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్‌ఎం, ప్రధానోపాధ్యాయులు తనిఖీలు చేపట్టనున్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం ఎనిమిది బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. బుధవారం నుంచి పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్కడి పరిస్థితులను విద్యా శాఖాధికారులకు నివేదిక రూపంలో అందించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యా పరిస్థితిపై పాఠశాల విద్యాశాఖకు ఎప్పటికప్పుడు రిపోర్టు అందజేస్తారు. బడి తీరు మారిందా?.. లేదా? అనే విషయాలపై ఆరా తీస్తారు. విద్యార్థుల ప్రగతితో పాటు రికార్డులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు, తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు.
రేపటి నుంచి..
ఆదిలాబాద్ జిల్లాలో డీఈవో పరిధిలో 708 పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 6 మోడల్ స్కూళ్లు, 17 కేజీబీవీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణను ఇప్పటికే మండల విద్యాధికారులు, సెక్టోరల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది నామ్‌కే వాస్తేగా తనిఖీలు చేపట్టడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటేషన్‌పై ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు పనిచేయనున్నారు. జిల్లాలో 495 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వీటికి సంబంధించి 15 మంది ఉపాధ్యాయులను నియమించారు. 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్‌ఎం ఉంటారు. 103 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక పీఎస్ హెచ్‌ఎం, ఒక ఎస్జీటీ ఉంటారు. ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. 110 ఉన్నత పాఠశాలలు ఉండగా, రెండు టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు ఎస్‌ఏలు, ఒకరు పీడీ, ఒక పీజీ హెచ్‌ఎం ఉన్నారు. మొత్తం 36 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌పై విధులను కేటాయించారు. వారంతా బుధవారం నుంచి పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. వారానికోసారి, లేనిపక్షంలో ప్రతీరోజు నివేదికను డీఈవో కార్యాలయంలో అందజేయనున్నారు.
వీరి స్థానాల్లో సర్దుబాటు..
బృందాలు సిద్ధం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలను తనిఖీ చేసేందుకు ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 5 బృందాలు, యూపీఎస్‌కు ఒక బృందం, ఉన్నత పాఠశాలలకు 2 బృందాలను ఏర్పాటు చేశాం. బుధవారం నుంచి వీరు పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. పాఠశాలల్లో అకాడమిక్, పలు రికార్డులను పరిశీలించి డీఈవో కార్యాలయానికి వేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వీరి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– అజయ్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి
తనిఖీ బృందాలు పనిచేసే ఉపాధ్యాయుల స్థానంలో సర్దుబాటు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో 2,628 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, 438 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 36 మందికి డిప్యూటేషన్ ఇవ్వడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడే అవకాశం ఉన్నట్లు పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 16 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలు అప్పజెప్పడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఏ మేరకు విద్యాశాఖ సర్దుబాటు చేయనుందో వేచిచూడాల్సిందే.
● రేపటి నుంచి పాఠశాలలకు ప్రత్యేక బృందాలు ● రికార్డులు,


