మరింత ఆర్థిక చేయూత
అర్హులైన వీధి వ్యాపారుల గుర్తింపునకు మళ్ళీ సర్వే రుణ పరిమితి గతంకంటే పెంపు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం కసరత్తు చేస్తున్న మెప్మా అధికారులు
కై లాస్‌నగర్: పట్టణంలోని చిరు వ్యాపారులకు పీ ఎం స్వనిధి కింద అందించే రుణాల గడువును కేంద్ర ప్రభుత్వం 2030 వరకు పొడగించింది. రుణ ప రిమితిని సైతం పెంచింది. గతంలో చేపట్టిన సర్వేలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరోసారి సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఆదిశగా మెప్మా సి బ్బంది కసరత్తు చేపట్టారు. సీవోల ఆధ్వర్యంలో స ర్వే చేస్తున్నారు. అర్హులను గుర్తించి ఐడీ కార్డులు జా రీ చేస్తారు. తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలను అందించనున్నారు. దీంతో తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు, వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక స్వావలంబన కలుగనుంది.
ఉద్దేశం ఏమిటంటే..
కరోనా వైరస్ ఉధృతితో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో వారికి ఆర్థిక చేయూతనందించాలని కేంద్రం నిర్ణయించింది. మెప్మా ద్వారా వారిని గుర్తించి ప్రత్యేకంగా ఐడీ కార్డులను జారీ చేసింది. అర్హులైన వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు మూడు విడతల్లో ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ (పీఎం స్వనిధి) పథకం ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందించింది. అయితే ఇటీవల ఈ పథఽకాన్ని నిలిపేసిన కేంద్రం తాజాగా ‘లోక్ కళ్యాణ్ మేళా’ పేరిట మళ్లీ పునరుద్ధరించింది. గతంలో రుణాలకు నోచుకోని వారిని కూడా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఐదు జోన్లుగా విభజన...
ఆదిలాబాద్ పట్టణంలో వీధి వ్యాపారాలు నిర్వహించే ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహణ బాధ్యతలను సీవోలకు అప్పగించారు. దస్నాపూర్ వంతెన నుంచి కలెక్టర్‌చౌక్, పెద్ద మార్కెట్ ఏరియాకు ఆర్.పన్నాలాల్, కలెక్టర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ రైతు బజార్ వర కు టి.గంగన్న, వినాయక్‌చౌక్ నుంచి శివాజీచౌక్ వరకు దేవిచంద్, గాంధీ, అంబేడ్కర్ చౌక్ వరకు జె. పండరి, వివేకానంద చౌక్ నుంచి నేతాజీచౌక్, కలెక్టర్ చౌక్ నుంచి కలెక్టర్ క్యాంపు ఆఫీస్ వరకు డి.సునీత, ఎన్టీఆర్‌చౌక్ నుంచి రైల్వే స్టేషన్, పంజాబ్‌చౌ క్, అంబేడ్కర్‌చౌక్, నెహ్రుచౌక్ వరకు వై.సందీప్‌రెడ్డిని నియమిస్తూ మెప్మా పీడీ సీవీఎన్.రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సీవోలు ఆయా ఏరియాల్లో వీధి వ్యాపారుల గుర్తింపునకు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేను పర్యవేక్షించే బాధ్యతలు టీఎంసీ భాగ్యలక్ష్మి, ఏడీఎంసీ ఎ.వెంకటమ్మకు అప్పగించారు.
రుణ పరిమితి పెంపు..
గతంలో మొదటి విడతలో రూ.10వేలు మంజూరు చేశారు. వాటిని సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి రెండో విడతలో రూ.15వేలు, వాటిని చెల్లించిన వా రికి మూడో విడత కింద రూ.50 వేలు మంజూరు చే శారు. తాజాగా ఈ పరిమితిని అదనంగా పెంచా రు. తొలి విడతలో రూ.15 వేలు అందించనున్నా రు. వాటిని 12 నెలల్లో తిరిగి చెల్లిస్తే రెండో విడతగా రూ.25 వేలు మంజూరు చేస్తారు. వీటిని 18 నెలల్లో చెల్లిస్తే మూడో విడత కింద రూ.50 వేలు మంజూ రు చేస్తారు. వీటిని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లించిన వారికి వడ్డీపై 7 శాతం రాయితీ వర్తిస్తుంది. తొలి విడతలో రూ.50 వేల రుణ పరిమితి దాటితే రుణం అందించేవారు కాదు. కానీ ప్రస్తుతం యూపీఐ లింక్‌తో కూడిన రూ.30 వేల పరిమితితో ఉన్న రూపే క్రెడిట్ కార్డులను అందించనున్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థికంగా లబ్ధిపొందవచ్చు.
పట్టణంలోని చిరు వ్యాపారుల వివరాలు
మెప్మా సిబ్బంది గుర్తించిన చిరువ్యాపారులు : 9,075
మొదటి విడతలో రుణాలు పొందిన వారు : 6,993
రెండో విడతలో రుణాలు పొందిన వారు : 2,983
మూడో విడతలో రుణాలు పొందిన వారు : 846
15 వరకు సర్వే పూర్తి
కేంద్రం ఆదేశాల మేరకు పట్టణంలోని వ్యాపార ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 329 మందిని కొత్తగా గుర్తించాం. ఈ నెల 15 వరకు సర్వే పూర్తి చేసి అర్హులకు ఐడీ కార్డులు జారీ చేస్తాం. తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తాం. మూడు విడతల రుణాలు పొందిన వారికి కొత్తగా రూ.30వేల పరిమితితో కూడిన క్రెడిట్‌కార్డులు అందిస్తాం.
– కె.శ్రీనివాస్, మెప్మా డీఎంసీ


