అవగాహనతోనే ఎయిడ్స్ అంతం
ఆదిలాబాద్‌టౌన్: అవగాహనతోనే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ను నియంత్రించవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ రాథోడ్ నరేందర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సమావేశ మందిరంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమన్నారు. అనుమానితులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ ఏడాది ‘అడ్డంకులను అధిగమిద్దాం.. ఎయిడ్స్ ప్రతిస్పందనను మారుద్దాం’ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అంతకు ముందు డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ రక్షణ లేని సెక్స్, కల్తీ రక్తం కారణంగా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందన్నారు. ఏఆర్‌టీ మందులు తీసుకుంటూ దీనిని దీర్ఘకాలిక వ్యాఽధిలా పరిగణించవచ్చన్నారు. ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేసిన వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. వ్యాసరచన, రంగోళి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి సుమలత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, జిల్లా మలేరియా అధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


