బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్‌స్టేషన్‌లో అందే ఫిర్యాదుపై ప్రత్యేక సిబ్బందితో దర్యాప్తు జరిపించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది బాధితులు తమ సమస్యలను విన్నవించగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతీ ఫిర్యాదుపై జవాబుదారీతనం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, వామన్, తదితరులు పాల్గొన్నారు.
అతివలకు అండగా షీ టీం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని మహిళల భద్రత, రక్షణకు ఆదిలాబాద్ షీ టీం అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో 25 కాల్స్ రాగా మూడింటికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. 4 ఎఫ్‌ఐఆర్ కేసులు, 12 ఈ పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా వేధింపులను అరికట్టే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 97 హట్‌స్పాట్‌లను తనిఖీ చేసి మహిళలు, యువతులను వేధిస్తున్న 39 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వివరించారు. బాధిత మహిళలు, యువతులు ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని 8712659953 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


