
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
సారంగపూర్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు జౌళి గ్రామానికి చెందిన పోటెండ్ల భీమేశ్ (34) శుక్రవారం సాయంత్రం స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని బంధువులు శనివారం ఉదయం ప్రాజెక్టు పరిసరాల్లో గాలించగా మృతదేహం లభ్యమైంది. కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతిచెంది ఉంటాడని బావించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి గతంలో వివాహమైనా విడాకులు కావడంతో ఒంటరిగానే ఉంటున్నాడని బంధువులు తెలిపారు.
చికిత్స పొందుతూ కార్మికుడు..
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని స్టోర్స్‌లో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి శ్రీనివాస్ (45)చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల మేరకు గత నెలలో విధి నిర్వహణలో ఉండగాఽ తేనెటీగలు కుట్టడంతో స్టోర్ అధికారి సూచన మేరకు ఒక్కడే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. సదరు అధికారి రమ్మని చెప్పడంతో ట్రీట్‌మెంట్ పూర్తి కాకుండానే వచ్చినట్టు సమాచారం. డిశ్చార్జ్ చేయకుండానే ఎందుకు వెళ్లావని ఆస్పత్రి సిబ్బంది అడగడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈక్రమంలో పది రోజుల క్రితం అధిక రక్తపోటుకు గురికావడంతో కేకే డిస్పెన్సరీకి వెళ్లగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓప్రైవేట్ తరలించి చికిత్స చేయించినా నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా విధి నిర్వహణలో ఉండగా తేనెటీగలు కుడితే బాధితునితో పాటు మరో సహాయకుడిని ఎందుకు పంపలేదని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
నీళ్లనుకుని పురుగుల మందు తాగిన యువకుడు●
● చికిత్స పొందుతూ మృతి
సిరికొండ: ఈ నెల 15న పురుగుల మందుతాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పూజ తెలిపారు. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ఆడ ప్రవీణ్‌కుమార్ (22) మంగళవారం రాత్రి పంటచేనుకు కాపలా వెళ్లాడు. దాహం వేయడంతో నిద్రమత్తులో నీళ్ల బాటిల్ అనుకుని పురుగుల మందు తాగాడు. వెంటనే ఇంటికి వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలపడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మొరం టిప్పర్లు పట్టివేత
దండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్ సమీపంలో అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్ అధికారులు శనివా రం పట్టుకున్నట్లు తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే తెలిపారు. పట్టుకున్న టిప్పర్లను దండేపల్లి పోలీస్టేషన్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి