
● అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ ● ప్రాధాన్యత సంతరించుకున్న
జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ అనిల్ కుమార్ (ఫైల్)
జిల్లా అధ్యక్షుడి ఎంపికలో అందరి ఆమోదం తీసుకోవాలి.. ఏకపక్షంగా నిర్ణయం ఉండరాదు.. అందరూ సూచించిన నాయకుడినే ఎంపిక చేయాలి.. జనబలం ఉండాలి.. కొంతమంది వద్ద డబ్బు ఉంటుంది కానీ, కార్యకర్తల అండ ఉండదు.. ఎవరు ఏమీ అనేదీ మాకు తెలుసు.. కొంతమంది వ్యవహారశైలి వల్లే సీతక్క వేరే జిల్లాకు వెళ్లిపోయింది.. ఆమెను అడిగినా జిల్లా నాయకుల వ్యవహారశైలి తెలిసి పోతుంది.. కార్యకర్తలు ప్రతిపాదించే పేరునే ఎంపిక చేయాలి.. లేనిపక్షంలో నేను ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్తాను.. నాకు కూడా మార్గాలు ఉన్నాయి.. ఈ మాటలన్నీ అన్నది ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు.. అదీ కూడా పార్టీ సంస్థాగత జిల్లా ఇన్‌చార్జీ, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్‌యాదవ్ ఎదుట.. ప్రస్తుతం పార్టీలో ఈ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.
సాక్షి, ఆదిలాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికకు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో డీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది నిర్ణయం జరుగుతుందని పార్టీలో చెప్పుకుంటున్నారు. తుదిదశకు ఈ ప్రక్రియ రాగా ఎంపిక కోసం పరిశీలనకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి సమక్షంలోనే ఎమ్మెల్యే బొజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం, ఆయన జిల్లా నేతల్లో ఎవరిని విభేదిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారోనని పార్టీలో నలుగురు కలిసిన ప్రతీచోట చర్చించుకుంటున్నారు.
ఆత్రం సుగుణ వర్గం గురించేననీ..
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో పార్లమెంట్ ఎన్నికలు, ఆతర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్ గాంధీభవన్ స్థాయిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలతో పలు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే జిల్లాలో గ్రూపు తగదాల కారణంగా పార్టీ ఓటమిపాలైందని, గ్రూపులకు కొంతమంది నేతల వ్యవహారశైలే కారణమని మీనాక్షి సమక్షంలోనే పలువురు ప్రస్తావించారు. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆత్రం సుగుణ మధ్య కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకుని వార్ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేసిన ఆత్రం సుగుణ ప్రధానంగా తన ఓటమికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులు సహకరించకపోవడంతోనేనని అప్పట్లో ఆరోపణలు చేశారు. అప్పటి నుంచే ఈ ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య తగదా మొదలైంది. ఇద్దరు ఖానాపూర్ నియోజకవర్గానికే చెందిన ఎస్టీ నేతలే కావడంతో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఈ వార్ జరుగుతోందని పార్టీలో చర్చ సాగుతుంది. తాజాగా మళ్లీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో ఈ వివాదం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆత్రం సుగణ తన వర్గానికి చెందిన నాయకుడికి అధ్యక్ష పదవి ఇప్పించే విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆ ప్రక్రియను విభేదిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారని చెప్పుకుంటున్నారు.
తుదిదశకు వచ్చినట్టేనా..
ప్రధానంగా పార్టీ పరంగా పరిశీలకులు పట్టణం, మండలం వారీగా సమావేశాలు నిర్వహించి ఇటు బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే గ్రామ, మండల, బ్లాక్ స్థాయి కమిటీల నియామకం కోసం విస్తృతంగా పర్యటించారు. ప్రతీ కమిటీకి సంబంధించి ఐదేసి పేర్లను సేకరించి అధిష్టానానికి పంపించారు. ఇక ఈ కమిటీల నియామకం జరుగుతుందనే దశలో వేరువేరు జిల్లాలతో పాటు మన జిల్లాలోనూ వివాదం నెలకొనడంతో ప్రక్రియ అలాగే నిలిచిపోయింది. దీంతో ఇప్పటి వరకు ఏ ఒక్క కమిటీ కూడా నియామకం కాలేదు. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఈ కమిటీల ఏర్పాటు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఉమ్మడి జిల్లాలకు ఇద్దరేసి ఇన్‌చార్జీలను నియమించి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, జిల్లా కమిటీలను కూడా 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా పూర్తి చేసేలా ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలని ఆమె నిరంతరం వారితో జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ జిల్లాకు రావడం జరిగింది. ఇక కమిటీలను ప్రకటించడమే తరువాయి అని పార్టీలో చెప్పుకుంటున్నారు. జిల్లా కమిటీ కూడా ప్రకటించడంతో పాటు డీసీసీ ఎవరనేదీ కూడా తేల్చేయనున్నట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో ఈ అధ్యక్షుల ఎంపిక పరంగా సామాజిక సమీకరణలను ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి మాత్రం జనరల్ కేటగిరీలో ఎవరినైనా అధ్యక్షుడిగా నియమించవచ్చని అంటున్నారు. ఇలా ప్రక్రియ తుదిదశకు రాగా తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.