
ఆయిల్‌పామ్ సాగు లాభదాయకం
● జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచాలి ● కలెక్టర్ రాజర్షిషా ● వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో సమీక్ష
కైలాస్‌నగర్: లాభదాయకమైన ఆయిల్‌పామ్ సాగుకు జిల్లా రైతులు ముందుకు రావాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా అనేక సబ్సిడీ పథకాలు అందిస్తున్నాయని తెలిపారు. జిల్లా రైతులు ఈ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. ఆయా మండలాల్లో ఏవోలు సాగు లక్ష్యాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పించాన్నారు. ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ఎస్.సుధాకర్, మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.
‘అమృత్ 2.0’పై సమీక్ష
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకం పురోగతిపై కలెక్టర్ రాజర్షిషా, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి బుధవారం సమీక్షించారు. కలెక్టరేట్ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అమృత్ పథకం ద్వారా పట్టణంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, పచ్చదనం పెంపు, రహదారి నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చేపడుతున్న నీటి సరఫరా అభివృద్ధి పనులు, ఎస్టీపీ నిర్మాణ పనుల పురోగతిపై అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రతీ ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పనులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సలోని, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.