
పోడు భూముల్లో మొక్కలు నాటొద్దు
● అటవీ అధికారులను అడ్డుకున్న కేశవపట్నం గ్రామస్తులు ● రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఇచ్చోడ: పోడు భూముల్లో మొక్కలు నాటొద్దంటూ మండలంలోని కేశవపట్నం గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. అటవీశాఖ వాహనాల్లో మొక్కలు తరలిస్తుండగా సిరిచెల్మ ఘాట్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. కొన్నేళ్లుగా తాము పోడు భూములు సాగు చేసుకుంటున్నామని, ప్రస్తుతం అందులో మొక్కలు నాటడం సరికాదన్నారు. సమాచారం అందుకున్న టైగర్‌జోన్ ఎఫ్‌ఆర్వో నాగవత్ స్వామి అక్కడికి చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అక్కడికి చేరుకుని వారికి మద్దతు పలికారు. డీఎఫ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరమించుకోవాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దీంతో అధికారులు, సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరి గారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.