● నిధుల్లేక నిలిచిన భవన నిర్మాణాలు ● ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు ● బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు ● చోద్యం చూస్తున్న బల్దియా అధికారులు | Sakshi
Sakshi News home page

● నిధుల్లేక నిలిచిన భవన నిర్మాణాలు ● ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు ● బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు ● చోద్యం చూస్తున్న బల్దియా అధికారులు

Published Mon, May 27 2024 3:40 PM

● నిధుల్లేక నిలిచిన భవన నిర్మాణాలు ● ఏళ్లు గడుస్తున్నా

ఇక్కడ కనిపిస్తున్నది ఆదిలాబాద్‌ పట్టణంలోని కై లాస్‌నగర్‌లో పట్టణ ప్రగతి నిధులు రూ.2కోట్లతో చేపట్టిన ఇండోర్‌ స్టేడియం. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న గుత్తేదారు 2022 డిసెంబర్‌లో పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు వేగంగా పనులు చేశారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో చేసేదిలేక నిలిపివేశాడు. గతేడాది జూన్‌ చివరి నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ పిల్లర్ల దశ దాటకపోవడం గమనార్హం.

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల దుస్థితికి ప్రతిబింబించే సాక్ష్యాలివి. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు నిధుల్లేక ఇలా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వాటి పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం ఇంకా పూర్తికావడం లేదు. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొంత మేర చేపట్టి బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. ఏళ్ల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో చేసేది లేక చేతులెత్తేశారు. దీంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయి అంసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. నిర్మాణాలు పూర్తి కావాల్సిన గడువు సైతం ముగిసి ఏళ్లవుతుంది. పిల్లర్ల ఇనుప చువ్వలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ శిథిలావస్థకు చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇదీ పరిస్థితి..

వీటి నిర్మాణాలు వేగవంతమయ్యేలా చూడాల్సిన బల్దియా ప్రేక్షకపాత్ర పోషిస్తుందనే విమర్శలున్నా యి. గుత్తేదారు చేపట్టిన పనులకు ఎంబీ రికార్డులు నమోదు చేసి బిల్లులను ట్రెజరీలో సమర్పిస్తున్నారు. అయితే ఆ నిధులను సర్కారు సకాలంలో విడుదల చేయకపోవడంతో గుత్తేదారుపై వారు ఎ లాంటి అజమాయిషీ చేయలేకపోతున్నారు. బిల్లులు ఎప్పుడు వస్తే అప్పుడు పనులు చేస్తామనే ధోరణిలో కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. వారు చేసినప్పుడే తాము చూస్తామనేలా అధికారుల తీరు ఉంది. ఫలితంగా భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరి గి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిమెంట్‌, ఇసుక, కాంక్రీట్‌ ఽవంటి ముడిసరుకు ధరలు పెరిగి పనుల నాణ్యతపై ప్రభావం పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదలయ్యేలా చూడాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపడం లేదని ఫలితంగానే ఏళ్ల తరబడి నిర్మాణాలు కొనసా..గుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బిల్లులు ట్రెజరీకి పంపించాం

రూ.7.20 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత మార్కెట్‌కు గాను కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు రూ.1.25 కోట్లకు సంబంధించి పనులను పూర్తి చేశారు. ఇందులో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలు చెల్లించాం. మరో రూ.2.85 కోట్లు ట్రెజరీకి పంపించాం. అలాగే ఇండోర్‌ స్టేడియానికి సంబంధించి రూ.2.24 కోట్ల వ్యయంతో చేపట్టగా రూ.45 లక్షల పనులు పూర్తయ్యాయి. ఈ బిల్లులను సైతం ట్రెజరీకి పంపించాం. అక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సైతం నివేదించాం.

– తిరుపతి, మున్సిపల్‌ ఇంజినీర్‌

అసంపూర్తిగా కనిపిస్తున్న ఈ నిర్మాణం జిల్లా కేంద్రంలోని సాత్నాల క్వార్టర్స్‌ స్థలంలో చేపట్టిన సమీకృత మార్కెట్‌ది. చికెన్‌, మటన్‌, చేపలు వంటి మాంసహార ఉత్పత్తులన్నీ వినియోగదారులకు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో రూ.7.20కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ నిర్మాణ పనులు 2021 డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. జీ ప్లస్‌–1 అంతస్తు నిర్మాణం వరకు పనులు చేపట్టారు. అదే ఏడాది దసరాకు ప్రారంభిస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. అయితే కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో గతేడాది పనులను నిలిపివేశాడు. ఎప్పుడు పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement