అనుమతి ఉంటేనే మైకుల మోత... | Sakshi
Sakshi News home page

అనుమతి ఉంటేనే మైకుల మోత...

Published Thu, Nov 9 2023 12:30 AM

-

అనుమతి ఉంటేనే మైకుల మోత...

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు నిబంధనల మేరకే ప్రచారం నిర్వహించాలని ఎన్నికల నిబంధనలు వెల్లడిస్తున్నాయి. దీని ప్రకారం నాయకులు కార్యకర్తలు ఉదయం 6గంటల తర్వాత ప్రచారాన్ని ప్రారంభించి రాత్రి పది గంటలలోగా ముగించాలి. 10గంటలు దాటిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు వంటివి నిర్వహిస్తే చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చీరలు, చొక్కాలు ఇతర దుస్తులు క్రీడా పరికరాలు వాటి వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసేటట్లుగా ప్రయత్నించకూడదు. టోపీలు, కండువాలను మాత్రం వాడొచ్చు. వాటిని ఖర్చులు ఎన్నికల వ్యయంలో పొందుపరచాలి. అభ్యర్థులు ఎన్ని వాహనాలు ఉపయోగించుకుంటారో, దానికి ముందస్తు అనుమతిని రిటర్నింగ్‌ అధికారి నుంచి పొంది ఉండాలని నిబంధనలు తెలుపుతున్నాయి. ప్రచార వాహనాలు, మైక్‌ సెట్‌లు ముందస్తు అనుమతి మేరకే వినియోగించాలి. సమావేశం, ఊరేగింపు వంటి వాటి కార్యక్రమాల సమాచారం పోలీసులకు ముందస్తుగా అందించాలి. ఊరేగింపులు, సభలు, సమావేశాలు కొనసాగుతున్నప్పుడు వివిధ రకాల రాజకీయ పార్టీలు ఒకేమార్గంలో వెళ్తున్నప్పుడు ఒకే సమయంలో ఊరేగింపులు తీస్తున్నప్పుడు పోలీసులకు సహకరిస్తూ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. విపరీతమైన శబ్దాలు, టపాసులు, భారీ పేలుళ్ల వంటి పదార్థాలను వినియోగించకూడదు. రాజకీయ పక్షాల వారు ఒకరికి ఒకరు దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement