నా వ్యాఖ్యలు వక్రీకరించడం సరికాదు

● క్రైస్తవ మతాన్ని కించపరచలేదు ● ఆదివాసీల కోసం చావుకై నా సిద్ధం ● ఎంపీ సోయం బాపూరావు

ఆదిలాబాద్‌: పాస్టర్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయపబ్బం గడుపుకోవడం సరికాదని ఎంపీ సోయం బాపురావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతి సురక్ష మంచ్‌ బహిరంగ సభలో ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీలను బలవంతపు మతమార్పిడి చేస్తున్న కొంతమంది పాస్టర్లను మాత్రమే విమర్శించానని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రైస్తవ సంఘాలు అపార్థం చేసుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఓ వర్గం వారు ఆది వాసీ జాతి యువతులను మాయమాటలతో లవ్‌ జిహాద్‌ ఉచ్చులో దించుతున్నారని, దీంతో సనాతన సంస్కృతి, ఆదివాసీ ఆచారాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. అంతరించిపోతున్న జాతి మనుగడ, ఆస్తిత్వం కోసం 70 ఏళ్లుగా పోరా టాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బహిరంగ సభలో మతం మారిన ఆదివాసీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేయడమే కాక తీర్మానం సైతం చేశామని వెల్లడించారు. ఆదివాసీల సంస్కృతిపై దాడి చేస్తున్న ఓ ముఠా గురించి తాను మనోవేదనతో ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా బలవంతపు మతమార్పిడి చేస్తున్న కొంత మంది పాస్టర్లపై బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తామని వ్యాఖ్యానించడం జరిగిందని తెలిపారు. జాతి కోసం ఉద్యమాలు చేస్తున్న తనపై కొందరు అకారణంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తాను క్రైస్తవ మతాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. ఆదివాసీ జాతి కోసం చావుకై నా సిద్ధమేనని, అన్ని మతాలు తన దృష్టిలో సమానమేనని, కొన్ని ముఠాల చర్యలను మాత్రమే తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top