మెన్యూ

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు (ఫైల్‌) - Sakshi

కొత్త మెనూ ఇదే..

వారం భోజనం

సోమ పప్పు, కిచిడి, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌

కర్రి, కోడిగుడ్డు

మంగళ రైస్‌, పప్పు, సాంబార్‌,

మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి బుధ రైస్‌, పప్పు, ఆకుకూరలు, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, కోడిగుడ్డు గురు పప్పు, వెజిటెబుల్‌ బిర్యాని, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి శుక్ర అన్నం, పప్పు, సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, కోడిగుడ్డు శనివారం అన్నం, ఆకుకూరల పప్పు,

మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి

మధ్యాహ్న భోజనంలో మార్పులు

ప్రతీరోజు పప్పన్నంతో పాటు కిచిడి

ఈనెల 12 నుంచి కొత్త మెనూ అమలు

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడుల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మరింతగా నాణ్యమైన భోజనం అందనుంది. పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్‌ 12 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇందులో భాగంగా ఇక నుంచి ప్రతిరోజు పప్పు అన్నంతోపాటు కొత్తగా కిచిడి కూడా విద్యార్థులకు వడ్డించనున్నారు.

జిల్లాలో..

జిల్లాలో 1,137 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 69,756 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1,729 మంది మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5.45 పైసల చొప్పున, అలాగే ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు రూ.8.17 పైసల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. దీంతోపాటు వారానికి మూడు రోజుల పాటు కోడిగుడ్లు పెట్టాల్సి ఉంది. ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

మెనూ అమలయ్యేనా..

సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడమే కారణంగా తెలిసింది. దీంతో గతేడాది పలు పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. ప్రతిరోజు మెనూ పాటించాల్సి ఉండగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు పట్టించుకోకపోవడంతో మెనూ జాడ లేకుండా పోయింది. నూతన విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. అయితే వారానికి మూడు రోజుల పాటు కోడిగుడ్లు పెట్టాల్సి ఉండగా, జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా ఇది పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. చాలా చోట్ల అన్నం, నీళ్ల పప్పే దిక్కవుతుంది. చేసేది లేక కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్‌ బాక్సులు తెచ్చుకోవడం గమనార్హం.

మెనూ పకడ్బందీగా అమలు చేస్తాం

ఈ విద్యా సంవత్సరంలో కొత్త మెనూను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రతిరోజు పప్పుతో పాటు కొత్తగా కిచిడిని మెనూలో పొందుపర్చారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు కోడిగుడ్లు అందేలా చూస్తాం. ఎంఈవోలతో పాటు సెక్టోరియల్‌ అధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను తనిఖీలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తాం.

– ప్రణీత, డీఈవో

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top