ఇంటి పెద్దదిక్కు.. ఆ చిన్నారి

ఇద్దరు కూతుర్లతో తండ్రి మలారి సింగ్‌
 - Sakshi

● కిడ్నీ వ్యాఽధితో మంచానికే పరిమితమైన తండ్రి ● ఎనిమిదేళ్ల క్రితం తల్లి మృతి ● మానసిక వికలాంగురాలైన సోదరి ● అన్నీతానై కుటుంబ భారం మోస్తున్న చిన్నారి ● మాటలు రాకపోయినా కడుపు నింపుతున్న వైనం..

బోథ్‌: మండలంలోని గుర్రాలతండా గ్రామానికి చెందిన మలారిసింగ్‌, ఊర్మిళకు నలుగురు కూతుర్లే. రెండవ కూతురు సరిత మానసిక వికలాంగురాలు. నాల్గో కూతురు గంగోత్రి మూగ. గంగోత్రి ఏడాది కాకముందే 2015లో అనారోగ్యంతో తల్లి ఊర్మిళ మృతిచెందింది. దీంతో కూతుర్లను తండ్రి మలారిసింగ్‌తో పాటు నాన్నమ్మ భాగవతిబాయి చూసుకున్నారు. 2016లో పెద్ద కూతురు కల్పనకు పెళ్లి చేశాడు. 2017లో నాన్నమ్మ భాగవతిబాయి మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి మలారిసింగ్‌ కూలీ పనిచేస్తూ కూతుర్లను పెంచాడు. 2022లో మూడో కూతురు మీనాక్షికి సైతం వివాహం చేశాడు.

విఽధి వంచించడంతో...

ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి మరో ఇద్దరు కూతుర్లను చూసుకుంటున్న తండ్రి మలారిసింగ్‌కు ఏడాది క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధి సోకింది. దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నమైంది. పూటగడవం కష్టంగా మారడంతో మూగ అమ్మాయి గంగోత్రి ఇంటింటా తిరుగుతూ కావాల్సిన భోజనం సమకూరుస్తుంది. అక్క సరితకు, తండ్రి మలారిసింగ్‌ కడుపునింపుతోంది.

కుటుంబ బరువు మోస్తున్న చిన్నారి...

నడవలేని స్థితిలోని తండ్రికి ప్రతి రోజు సపర్యలు చేస్తుంది. స్నానం చేయించడం మొదలు అన్నం తినిపించే వరకు అన్నీతానై చూసుకుంటుంది ఆ చిన్నారి. అక్క సరిత మానసిక వికలాంగురాలు కావడంతో ఎటువెళ్లినా గ్రామంలో వెతికి ఇంటికి తీసుకువస్తుంది. మాటలు రాకపోయినా ఆ చిన్నారి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తోంది.

చికిత్సకు డబ్బులు లేక...

మలారిసింగ్‌ కనీసం చికిత్స చేసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నాడు. గతంలో వైద్యులు రాసిచ్చిన మందులనే ఎవరైనా కొనిస్తే వాడుకుంటున్నాడు. చికిత్సకు, డయాలసిస్‌ చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లుతున్నాడు. దాతలు స్పందించి ఆ చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

స్పందించాల్సిన దాతలు...

చౌహాన్‌ వినోద్‌ : గూగుల్‌ పే, ఫోన్‌ పే 7670921393

ఆ కుటుంబాన్ని చూస్తే ఎవరికై నా గుండె తరుక్కుపోవాల్సిందే. తల్లి ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. తండ్రి కిడ్నీ వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. అక్క మానసిక వికలాంగురాలు. ఎనిమిదేళ్ల ఆ చిన్నారికి మాటలు రావు(మూగ). అయినా ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది. అన్నీతానై కుటుంబాన్ని చూసుకుంటోంది. ఉండేందుకు సరైన ఇళ్లు లేదు. ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో ఇంటింటా తిరుగుతూ కుటుంబం కడుపునింపుతోంది.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top