ఇక్కడ తెలంగాణ సర్టిఫికెట్లు చెల్లవు
పోలవరం ముంపు మండలాల ఉద్యోగార్థులకు ఏపీలో వింత పరిస్థితి
రంపచోడవరం ఐటీడీఏ నియామకాల్లో తిరస్కరణ పర్వం
సాక్షి, హైదరాబాద్: ‘ఇక్కడ తెలంగాణ సర్టిఫికెట్లు చెల్లవు. ఆంధ్రలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటవుతాయి. మీరు ఉద్యోగానికి అర్హత సాధించినా ఉపయోగం లేదు.’ ఇదీ పోలవరం ముంపు మండలాల అభ్యర్థుల దీనగాథ. రాష్ట్రం విడిపోయి ఏడాదిన్నర మాత్రమే అయింది. 2014 జూన్ 2కు ముందు చదువులన్నీ ఉమ్మడి ఏపీలో కొనసాగాయి. ఆ తర్వాత 10వ షెడ్యూల్లోని కొన్ని సంస్థలు ఇప్పటికీ ఉమ్మడిగానే ఉన్నాయి. కానీ పోలవరం ముంపు మండలాలైన కూనవరం, చింతూరు, ఎటపాక, వీఆర్పురం మండలాలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వస్తాయి.
కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు పశ్చిమగోదావరి జిల్లాలోకి వస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చే నాలుగు మండలాలు రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. తాజాగా ఐటీడీఏ పరిధిలో పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, సబ్సెంటర్ల పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్ఏ (ఫీమేల్) తదితర పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ముంపు మండలాలకు చెందిన షెడ్యూల్డ్ తెగ (కోయ) అభ్యర్థులు ఎంపికయ్యారు. వారు శుక్రవారం నియామక పత్రాలు తీసుకునేందుకు వెళ్లగా అందరినీ తిరస్కరించారు.
ఆందోళనలో అభ్యర్థులు: మీ సర్టిఫికెట్లు తెలంగాణ పారామెడికల్ బోర్డులో నమోదై ఉన్నాయని, ఇలాంటి సర్టిఫికెట్లు చెల్లవంటూ తోసిపుచ్చారు. వాస్తవానికి మొన్నటి దాకా పారామెడికల్ బోర్డు 10వ షెడ్యూల్లో ఉండేది. తాజాగా విడిపోయింది కానీ, ఏపీలో ఇంకా ఏర్పాటు చేయలేదు. ఎంపికైన అభ్యర్థులందరూ తమ సర్టిఫికెట్లతో సోమవారం ఏపీ వైద్యవిద్యా సంచాలకులు (డీఎంఈ) కార్యాలయానికి ఆందోళనగా వచ్చారు. తమ సర్టిఫికెట్లను ఏపీ పారామెడికల్ బోర్డులో చేయనిదే ఉద్యోగాలు ఇవ్వలేమని చెబుతున్నారని డీఎంఈ కార్యాలయంలో విన్నవించుకోగా... ఇక్కడ ఇంకా పారామెడికల్ బోర్డే ఏర్పాటు చేయలేదని, తామేమీ చేయలేమని సమాధానమిచ్చారు. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఆవేదన వర్ణనాతీతమైంది. తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్న కోయ తెగకు చెందిన తమను ఇలా సర్టిఫికెట్లు చెల్లవని వేధించడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.