సింగపూర్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
సింగపూర్ : సుదీర్ఘకాలం పాటు సింగపూర్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సెల్లప్పన్ రామనాథన్(92) కన్నుమూశారు. ఎస్ఆర్ నాథన్గా పేరుగాంచిన ఆయన, సింగపూర్‌కు 1999 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 31 జూలైన గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రి పాలయ్యారు. సింగపూర్ జనరల్ హాస్పిటల్లో నాథన్ చికిత్స పొందుతూ సోమవారం ఆఖరి శ్వాస విడిచినట్టు ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షుడిగా టోనీ ట్యాన్ బాధ్యతలు చేపట్టక ముందు నాథన్ రెండు సార్లు సింగపూర్‌కు అధ్యక్షుడిగా సేవలందించారు.
సివిల్ సర్వీసులో ఆయనది టాప్ స్థానం. 1988లో మలేషియాకు హై కమిషనర్‌గా ఎంపికయ్యారు. 1990 నుంచి 1996 వరకు అమెరికాకు సింగపూర్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.అనంతరం 1999 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా సింగపూర్ కు సేవలందించారు . నిరంతరం సమాజ సేవకే నాథన్ పరితపించే వారని ప్రధానమంత్రి లీ సియన్ లూంగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఎన్నో పబ్లిక్ సర్వీసు పోస్టులకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. సింగపూర్‌కు నిజమైన పుత్రుడిగా నాథన్‌ను లీ అభివర్ణించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆయన అంతిమ యాత్రకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తుందని వెల్లడించారు. నాథన్ భారతి సంతతికి చెందిన వ్యక్తి. ఆయనకు భార్య, కూతురు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు.