Returning Officer election
-
ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ ఆదేశాలు
సాక్షి, అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రాల వద్ద రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి తొలి విడత రాండమైజేషన్ కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. అధికారులు వారికి అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించడంలో భాగంగా చెక్‌లిస్ట్ ప్రకారం ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏ సామగ్రి అందుబాటులో ఉండాలని అనేది ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని 22వ తేదీ సాయంత్రానికి సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈడీటీలు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విధులు ఎలా నిర్వహించాలి? అనే అంశంపై కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 18న జేఎన్టీయూ ఆడిటోరియంలో శిక్షణ ఉంటుందన్నారు. ఉదయం కౌంటింగ్ సూపర్వైజర్లకు, మధ్యాహ్నం కౌంటింగ్ సహాయకులకు శిక్షణ ఇస్తారన్నారు. 19వ తేదీ ఉదయం సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఎలా నిర్వహించాలనే అనేదానిపై అదే రోజు మధ్యహ్నం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల అధికారులకు లైవ్ డెమో నిర్వహించాలని ఆర్ఓ కూర్మనాథ్‌ను ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ హాజయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెమోలో అసలైన సామగ్రిని వినియోగించాలని, అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈడీటీలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. 20వ తేదీన రిటర్నింగ్ అధికారులందరూ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి డెమో నిర్వహించాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిశీలకులు వస్తారు నియోజకవర్గాల పరిశీలకులు ఈనెల 19, 20 తేదీల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ, విధివిధానాలపై 21వ తేదీన ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తారన్నారు. కౌంటింగ్ సమయంలో చిన్న పొరపాటూ దొర్లకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. -
పోలింగ్ సామగ్రి వచ్చే..
సాక్షి,మణుగూరురూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఈనెల 10న ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వీపీ.గౌతమ్ తెలిపారు. సోమవారం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రశాంతంగా నిర్వహించేందుకు 13సెక్టార్లు, 27విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. 70మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని, ప్రత్యేక డ్యూటీ చేసే ఉద్యోగులు ఉదయం 5గంటలకే ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు 48ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, 10వ తేదీన పంపిణీ సెంటర్లలో పోలింగ్ సిబ్బంది1190, ఇతర కౌంటర్లలో 70మంది ఉద్యోగులు విధులు చేస్తారని తెలిపారు. వారికి కావాల్సిన భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. 231పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పెట్టుకోడానికి 231బ్యాగ్‌లు వారి పోలింగ్ కేంద్రాల నంబర్లతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలిపారు. సిబ్బంది, ఉద్యోగులు సకాలంలో హాజరై ఏన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్టీ.ప్రకాశరావు, ఎస్డీసీ బి.వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పరిపాలనా అధికారి సురేష్‌బాబు, ఏపీఓ పవర్ అనురాధ, పీఎంఆర్సీ రమణయ్య, భావ్‌సింగ్, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు. -
‘పుర’పోరుకు కసరత్తు
ఆదిలాబాద్‌రూరల్: మున్సిపాలిటీ పాలక వర్గాల గడువు త్వరలో ముగియనుండడంతో మరో మూడు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. మే 31లోగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ నుంచి మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు ముసాయిదా జాబితా తయారీకి ఆదేశించింది. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. వీటి బాధ్యతలను కమిషనర్లకు అప్పగించారు. ఈ నెల 16న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. 27న తుది జాబితాను విడుదల చేస్తారు. 28న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. వార్డుల పెంపుపై స్పష్టత కరువు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే మొదటి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసి మే 31లోగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డులను పెంచడంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైనా గ్రామ పంచాయతీలను అధి కారులు సమీప వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డులకు తోడు మరో ఐదు వార్డులు పెంచాలంటూ మున్సిపల్ కౌన్సిల్, ఎమ్మెల్యే జోగు రామన్న రాష్ట్ర మున్సిపల్ శాఖకు విన్నవించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపాలిటీలో కొత్తగా వార్డులు పెరుగుతాయా..లేక ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా..? అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు విధివిధానాలు.. మున్సిపాలిటీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కుటుంబంలోని ఓటర్లు అందరు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు విని యోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితాలను రూపొందించే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారితోపాటు సహాయ అధికారిని నియమించే అవకాశం ఉంది. విలీన గ్రామాలపై తేలని నిర్ణయం.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. గతేడాది పట్టణానికి సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. మావల పంచాయతీ, బట్టిసావర్గాం, రాంపూర్, అనుకుంట, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌లను మున్సిపాలిటీలో కలిపేశారు. సీడీఎంఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు విలీన జీపీలు, కాలనీలను సమీప మున్సిపాలిటీ వార్డుల్లో విలీనం చేశారు. దీంతో 32వ వార్డులో రాంపూర్ గ్రామాన్ని కలిపారు. 13వ వార్డులో అనుకుంట, 27వ వార్డులో బట్టిసావర్గాం జీపీలోని టైలర్స్‌కాలనీ, వివేకానంద, ఎన్‌హెచ్‌బీ కాలనీ, అగ్రజా టౌన్షిప్, ఆదర్శకాలనీ, భగత్‌సింగ్ కాలనీలను విలీనం చేశారు. 3వ వార్డులో బేల్లూరి, నిషాన్ఘాట్, 19వ వార్డులో మావల మేజర్ గ్రామ పంచాయతీలోని దస్నాపూర్, దర్గానగర్, కేఆర్‌కేకాలనీ, పీహెచ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కృష్ణానగర్, అటెండర్ కాలనీలను విలీనం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 36 వార్డులు ఉండగా మరో ఐదు వార్డులను పెంచి మొత్తం 41 వార్డులు చేస్తారని మున్సిపల్ పాలకవర్గం భావిస్తూ వస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికల ముసాయిదా విడుదల చేసింది. కొత్తగా వార్డులు పెంచుతారా..లేక సర్దుబాటు చేసిన వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారి సంఖ్య అన్ని పార్టీలలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వార్డులు పెరిగితే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకునే అశావహుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ఇలా ...
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పని సరిగా ఓటు వేయాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల రోజు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగి, పోస్టల్ బ్యాలెట్æద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఫారం –12 ద్వారా రిటర్నింగ్ అధికారికి అభ్యర్థన పత్రం రాయాలి. జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి నిర్ధారణ పత్రంతో పాటు ఫారం–12 అందజేస్తారు. ఇది పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేయడానికి సరిపోతుంది. ఫారం–12 నింపి దానితో పాటు పోలింగ్ విధులకు నియమిస్తున్నట్లు ఇచ్చిన డబ్లుకేట్ ఆర్డర్ కాపీని జత పరచి రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఇది పోలింగ్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన కేంద్రంలో కూడా అందజేయవచ్చు. పోలింగ్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఇచ్చిన తరువాత వారు ఓటు వేసి దానిని శిక్షణ తరుగతుల్లోనే జమచేసి వీలు రిటర్నింగ్ అధికారికి కల్పిస్తారు. దీని వల్ల పోస్టులో పంపాల్సిన అవసరం ఉండదు. మహిళ ఉద్యోగులు తాము పని చేస్తున్న నియోజక వర్గంలోనే పోస్టు అవుతారు. ఇలాంటి సందర్భంలో వారికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు వారు ఎన్నికల విధులు నిర్వహించ వలసి ఉంటుందో అక్కడ ఓటు వేయవచ్చు.చివరి క్షణాల్లో ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ)ఫోస్టింగ్ రద్దు ఆయితే వారు ఎక్కడ డ్యూటీ చేస్తారో అక్కడ ఓటు వేయవచ్చు. అయితే వారికి ఓటు ఉండాలి. -
తరలించిన జనాలకూ..లెక్కుంది
నల్లగొండ :సార్వత్రిక ఎన్నికల సభలు, సమావే శాలకు వాహనాల్లో తరలివచ్చిన జనాలకు ఎన్నికల అధికారులు లెక్కగట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎన్నికల వ్యయ పరిశీలకులు సభలకు వచ్చిన ఒక్కో వ్యక్తికి రెండు వందల రూపాయలను ఖర్చుగా నిర్ణయించారు. ఈ మొత్తా న్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతాలో జమ చేయనున్నా రు. వ్యయ పరిశీలకుల బృందాలు బహిరంగ సభలు, సమావేశాలకు వచ్చిన ప్రజలను వివరాలు అడిగి వీడియో ద్వారా రికార్డు చేశారు. ఈ సమయంలో అధికారులు ఆసక్తికర అంశాలను రికార్డు చేశారు. ఉదయం ఒక సభలో కనిపించిన ప్రజలు, సాయంత్రం మరొక సభలో కూడా కనిపించడం విస్మయానికి గురిచేసింది. ఈ విధంగా సభలకు వచ్చిన జనా ల నుంచి వివరాలు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోవిధం గా సమాధానం ఇచ్చారు. ఒకరు వంద కూలి, బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అని చెబితే.. మరొకరు రెండువందల కూలి, బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అని సమధానం ఇచ్చా రు. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన వ్యయ పరిశీలకులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఒక ధర నిర్ణయించారు. ఈ ప్రకారంగా సరాసరి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల ధర నిర్ణయించారు. అయితే ఈ మొత్తం కూడా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల వ్యయ ఖాతాల్లోకి వెళ్తుంది. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయలెక్కలు సమర్పించే అంశం పై అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో కలెక్టర్ చిరంజీవులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలకు వచ్చిన జనాలకు కూడా ధర నిర్ణయించే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, పార్టీ ల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, రూ.200 చాలా తక్కువని, తమవద్ద పూర్తి ఆధారాలున్నాయని, ప్రజ లు చెప్పిన అంశాలను రికార్డు చేశామని కలెక్టర్ చెప్పారు. అయితే, రూ.200 కాకుండా, పొరుగు జిల్లాలు నిర్ణయించిన ధరను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏజెం ట్లు, అభ్యర్థులు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆర్ఓలు లేకుండానే సమీక్ష... ఎన్నికల వ్యయ వివరాలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా వివరాలు సమర్పించలేదు. 12 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ సమావేశానికి ఏ ఒక్కరూ హాజరుకాలేదు. భువనగిరి ఆర్డీఓ మినహా మిగతా ఆర్డీఓలు హాజరయ్యారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు సమర్పించడంలో ఆర్ఓలది కీలక బాధ్యత. అలాంటి సమావేశంలో వారు లేకుండా కలెక్టర్ సమావేశాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు హాజరుకాగా, మిగతా పార్టీల నుంచి ఏజెంట్లు మాత్రమే వచ్చారు. ముంచుకొస్తున్న గడువు... ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేసింది. గడువులోగా అభ్యర్థులు లెక్కలు ఇవ్వకుంటే వారిపై చట్టంలో పేర్కొన్న విధంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. అభ్యర్థులు ఈ నెల 15లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంది. ఓడిన అభ్యర్థులతో పాటు, గెలిచిన అభ్యర్థులు కూడా లెక్కలు ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగంలోకి దిగనున్న వ్యయ పరిశీలకులు.. ఈ నెల 15 తేదీ నాటికి అభ్యర్థులు సమర్పించిన లెక్కల వివరాలను పునఃపరిశీలించేందుకు రాష్ట్రం నుంచి వ్యయ పరి శీలకులు జిల్లాకు రానున్నారు. 16,17,18 తేదీల్లో పరిశీలకులు జిల్లాలోనే మకాం వేసి అభ్యర్థులు సమర్పించిన లెక్కలు నిబంధనలకు లోబడి ఉన్నాయా..? లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. లెక్కలు ఇవ్వని అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.


