తమిళులూ మా సోదరులే
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కుమారుడితో సహా
తిరుమల ఆలయ సందర్శన
రాజపక్సకు వ్యతిరేకంగా ఎండీఎంకే నిరసనలు
తిరుమల: ‘‘తమిళులూ మా సోదరులే’’ అని శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స పేర్కొన్నారు. ‘‘శ్రీలంకలో తమిళులైనా, సింహ ళులైనా, ముస్లింలైనా.. ఎవరైనా ఒకటే’’ అని ఆయన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రాజపక్స తన రెండో కుమారుడు హోషితా రాజపక్సతో కలసి బుధవారం వేకువజామున తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ తన పర్యటనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సుప్రభాత సేవ అనంతరం పచ్చ కర్పూరపు వెలుగులో గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ తిరుమల జేఈఓ కె.ఎస్.శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు.
మెడలో తెలుపు కండువా...
సాధారణంగా మహీంద రాజపక్స తెలుపు దుస్తులు ధరించి మెడలో ఎర్రటి మఫ్లర్ వేసుకుని కనిపిస్తారు. ఆ ఎరుపు మఫ్లర్ విప్లవ సంకేతమని అంటుంటారు. మంగళవారం తిరుమలకు వచ్చినపుడు, తిరుగు ప్రయాణంలోనూ రాజపక్స అలాగే కనిపించారు. అయితే, సుప్రభాత సేవలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మెడలో ఎర్రటి కండువా బదులు తెలుపు కండువాతో వచ్చారు. ఆలయ సంప్రదాయాన్ని జేఈఓ తెలియజేయడంతో రాజపక్స కూడా ఆచరించారు. శ్రీవారి దర్శనం తర్వాత అతిథిగృహానికి చేరుకుని కాసేపు విశ్రమించిన అనంతరం రాజపక్స తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా 2 గంటలపాటు ట్రాఫిక్ నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎండీఎంకే నిరసన.. కార్యకర్తల అరెస్ట్
రాజపక్స పర్యటన సందర్భంగా తిరుమలలో బుధవారం వేకువజామున 2 గంటలకు ఎండీఎంకే పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. లక్ష మంది తమిళులను ఊచకోత కోసిన రాజపక్స డౌన్‌డౌన్ అంటూ.. అతడిని అరెస్ట్ చేయాలని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి సి.ఇ.సత్య డిమాండ్ చేశారు. నిరసనకారులపై పోలీసులు ముష్ఠిఘాతాలు కురిపిస్తూ 80 మందిని అరెస్ట్ చేశారు. ఇదే సందర్భంలో వారి ఆందోళనను చిత్రీకరిస్తున్న తమిళ మీడియా విలేకరులపైనా పోలీసులు దాడి చేసి కెమెరాలను విరగ్గొట్టారు. తర్వాత వారిని తిరుమలకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆకాశగంగలో వదిలిపెట్టారు. మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడి పట్ల తమిళ, స్థానిక మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేసి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.