breaking news
Market records Rally
-
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ..
ఇంట్రాడే, ముగింపులో కొత్త శిఖరాలకు సూచీలు * 8,900 మార్క్‌ను దాటిన నిఫ్టీ, 75 పాయింట్లు ప్లస్ * 292 పాయింట్ల లాభంతో 29,571కు సెన్సెక్స్ ముంబై: భారత స్టాక్మార్కెట్లో ఇటీవల ప్రతిరోజూ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగుస్తున్నాయి. సోమవారం రిపబ్లిక్‌డే సెలవు అనంతరం మంగళవారం ప్రారంభమైన మార్కెట్ రికార్డుల ర్యాలీని కొనసాగించింది. వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి 29,619, నిఫ్టీ 8,925 పాయింట్లను తాకాయి. చివరకు సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 29,571 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 8,911 వద్ద ముగిశాయి. ఇవి రెండూ రికార్డ్ స్థాయి ముగింపులు. ఈ సూచీలు రికార్డ్ స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా ఐదో రోజు. తాజా ర్యాలీలో నిఫ్టీ తొలిసారిగా 8,900 మార్క్‌ను దాటేసింది. ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్ స్థిరీకరణ సూచనలు కనిపించాయి. కానీ చివరి గంటలో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు అనూహ్యంగా పెరిగిపోయాయి. వరుసగా 8 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,224 పాయింట్లు(8%), నిఫ్టీ 600 పాయింట్ల చొప్పన లాభపడ్డాయి. జోష్‌నిచ్చిన ఒబామా పర్యటన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు మరింత పటిష్టం కానుండడం స్టాక్ మార్కెట్లలో జోష్‌ను పెంచింది. గ్రీస్ ఎన్నికల్లో సంస్కరణలను వ్యతిరేకించే సిరిజా పార్టీ విజయం సాధించడంతో ఆసియా మార్కెట్లు ఊగిసలాటకు గురైనా, భారత మార్కెట్లు దూసుకెళ్లాయి. ఒబామా పర్యటన సందర్భంగా భారత్‌లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాల కోసం అమెరికా 400 కోట్ల డాలర్లు పెట్టుబడులు, రుణాల రూపంలో అందించనుండడం మార్కెట్లకు జోష్‌నిచ్చిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు బంధం బలపడుతున్న కారణంగా క్యాపిటల్ గూడ్స్, రక్షణ రంగ షేర్లు వెలుగులు విరజిమ్మాయి. భెల్, ఎల్ అండ్ టీ, పిపవావ్ డిఫెన్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ షేర్లు 1-7 శాతం రేంజ్లో పెరిగాయి. సిప్లా 4.6%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.5%, ఐటీసీ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.9%, టాటా మోటార్స్ 2.9 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.1 శాతం చొప్పున పెరిగాయి. కాగా, మంగళవారం విదేశీ ఇన్వెస్టర్ల రూ.953 కోట్ల నికర కొనుగోళ్లు జరపారు. దేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ.783 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్ వరకూ బ్యాంక్ షేర్ల జోరు గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,224 పాయింట్లు లాభపడింది. దీంట్లో సగం వాటా (1,200 పాయింట్ల మేర) ఐదు ఆర్థిక రంగ షేర్లదే. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్ల పెరుగుదలతో సెన్సెక్స్ దూసుకుపోతుందని, వచ్చేవారంలో జరిగే పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పరుగులు పెడుతున్నాయని విశ్లేషకులంటున్నారు. కాగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్‌బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో గరిష్ట స్థాయిలను తాకాయి. మంచి పనితీరు, ఇటీవలి రేట్ల కోత, కొన్ని బ్యాంకులకు అనుబంధ బీమా, బ్రోకరేజ్ కంపెనీలు ఉండడం(బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు త్వరలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి) వంటి కారణాల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బాగా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. బడ్జెట్ వరకూ బ్యాంకింగ్ షేర్ల హవా కొనసాగుతుందని, బడ్జెట్ తర్వాత కరెక్షన్ ఉంటుందనేది వారి అభిప్రాయం. కాగా యాక్సిస్ బ్యాంక్ షేర్ రికార్డ్ స్థాయిని(రూ.598) తాకి 4.7% లాభంతో రూ.592 వద్ద ముగిసింది. ఈ షేర్ రూ.840కు చేరుతుందనేది మోర్గాన్ స్టాన్లీ అంచనా.


