‘రెండు కోట్లు ఇచ్చిన వాళ్లెవరో చెప్పండి’
న్యూఢిల్లీ: నిరుడు ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీపార్టీకి అర్ధరాత్రి రెండు కోట్లు ఇచ్చిన వాస్తవ వ్యక్తులెవరన్నదీ 48 గంటల్లోగా ప్రకటించాలని, ఆప్ నుంచి విడిపోయిన ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్(అవామ్) డిమాండ్ చేసింది. లేకపోతే తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించింది. ఢిల్లీ పోలీసుకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని అవామ్ ప్రతినిధి గోపాల్ గోయల్ మంగళవారం చెప్పారు.
ఆప్ నిజంగా తప్పు చేయకపోతే, చెక్కులు ఇచ్చిన కంపెనీలు వాటితో పాటు రాసిన కవరింగ్ లెటర్లను, ఆ కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశపు మినిట్స్‌ను బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. పేరు, తేదీలు లేని రెండు చెక్కులను కూడా గోపాల్ గోయల్ విలేకరుల సమావేశంలో చూపించారు. ఇలాంటి చెక్కుల ద్వారా ఆప్ మనీల్యాండరింగ్‌కు పాల్పడుతోందన్నారు. అయితే ఈ చెక్కులు వారికెక్కడి నుంచి వచ్చాయన్న ది మాత్రం ఆయన చెప్పలేదు. వీటి వెనుక అసలు శక్తులను కేజ్రీవాల్ బయట పెట్టాలని గోయల్ కోరారు.