మొరాయింపు

108 vehicles services slow in vizianagaram district - Sakshi

మూలకు చేరుతున్న 108 వాహనాలు 

సేవల్లో జాప్యం

రోగులకు తప్పని అవస్థలు

ఆపత్కాలంలో అపర సంజీవినిగా పేరొందిన 108 నేడు కుర్రోమొర్రో అంటుంది. 108కి ఫోన్‌ వెళ్లగానే సంఘటనా స్థలానికి చేరాల్సిన వాహనం నేడు గంటల తరబడి రావడం లేదు. ఈ సమయంలో ఒక్కోసారి ప్రాణ సంకటంగా మారుతుంది. మరమ్మతులకు గురైన వాహనాలను బాగు చేయించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో అవస్థలు తప్పడం లేదు.  

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో 108 అంబులెన్సులు 30 ఉన్నాయి. వీటిలో 27 వాహనాలు సేవలు అందిస్తుండగా రెండు బ్యాకప్‌ అంబులెన్సులు ఉన్నాయి. మరొకటి అడ్వాన్స్‌డ్‌  లైఫ్‌ సపోర్ట్‌ వెహికల్‌. వీటిల్లో ప్రస్తుతం ఆరు అంబులెన్సులు మూలకు చేరాయి. గరివిడి, కురుపాం, గజపతినగరం, ఎస్‌.కోట మండలాలకు చెందిన అంబులెన్సులు మూలకు చేరాయి.  బ్యాకప్‌ అంబులెన్సులు రెండు కూడా మూలకు చేరాయి.

రెండు మూడు మండలాలకు...
జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవి 24 అంబులెన్సులు. పది మండలాల్లో అంబులెన్సులు లేవు. దీంతో రెండు, మూడు మండలాలకు ఒక అంబులెన్సు చొప్పున అధికారులు సర్ధుబాటు చేశారు. దీంతో రోగులకు సేవలు అందడంలో జాప్యం చోటు చేసుకుంటుంది.

సేవల్లో జాప్యం
రెండు, మూడు మండలాలకు ఒక అంబులెన్సు ఉండడం వల్ల సేవల్లో జాప్యం జరుగుతుంది. 15 నుంచి 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు గంటన్నరకుగాని సంఘటన స్థలానికి చేరుకోవడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు.

ఎస్‌.కోటలో ప్రమాదం జరిగితే...
ఎస్‌.కోటలో ఏదైనా ప్రమాదం జరిగితే గంట్యాడ అంబులెన్సు వెళ్లాల్సిన దుస్థితి. గంట్యాడ నుంచి ఎస్‌.కోట వెళ్లాలంటే 20 నుంచి 22 కిలోమీటర్లు దూరం ఉంటుంది.  అదే సమయంలో గంట్యాడ అంబులెన్సు ఏదైనా కేసులో ఉంటే ఆ వాహనం  వచ్చే వరకు ఎస్‌.కోట రోగులు నిరీక్షించాల్సిందే లేదంటే ప్రైవేటు అంబులెన్సులో వెళ్లాలి. గజపతినగరం జాతీయ రహదారిపై ఉంది. ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అంబులెన్సు లేదు. గజపతినగరంలో ప్రమాదం జరిగితే దత్తిరాజేరు నుంచిగాని మెంటాడ నుంచిగాని అంబులెన్సు రావాలి. అదే విధంగా గరివిడిలో ప్రమాదం జరిగితే చీపురుపల్లి అంబులెన్సు రావాలి. గిరిజన ప్రాంతమైన కురుపాంలో కూడా అంబులెన్సు మరమ్మతులకు గురైంది. ఇక్కడ ప్రమాదం జరిగితే కొమరాడ నుంచిగాని జియ్యమ్మవలస నుంచిగాని అంబులెన్సు రావాలి. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి రోగి ప్రాణం మీదకొస్తుంది. దీంతో రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

మరమ్మతులకు గురయ్యాయి...
జిల్లాలో ఆరు అంబులెన్సులు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగు చేయిస్తున్నాం. త్వరలోనే రోగులకు అందుబాటులోకి తెస్తాం. సక్రమంగా సేవలు అందిస్తాం. –బి.దుర్గానాధ్, 108 మేనేజర్‌

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top