నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం

man suicide attempt at pendurthi police station - Sakshi

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ ఎదుట నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన జనాన్ని బెంబేలెత్తించింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తిలో నివాసం ఉంటున్న మునస మహాలక్ష్మినాయుడు(45) అనే వ్యక్తి భార్య రాజరాజేశ్వరిపై అనుమానంతో గత ఏడాది అక్టోబర్‌ 13న ఇంట్లో ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి హతమార్చినట్లు కేసు ఉంది. ఈ క్రమంలో అతను 80 రోజులు జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉండి కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై వచ్చాడు. దీంతో ఆదివారం అతడి వద్దకు పిల్లలు శ్వేత, సాయితో పాటు భార్య తరఫు బంధువులు వచ్చి పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో పిల్లల పేర ఆస్తి రాసిస్తానని, అయితే పిల్లలు తన వద్దే ఉండాలని మహాలక్ష్మినాయుడు షరతు పెట్టాడు. దీనికి పిల్లలతో సహా బంధువులు ఒప్పుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో పిల్లలను కూడా చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ మహాలక్ష్మినాయుడిపై సోమవారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మినాయుడు బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చి ఎదురుగా ఉన్న బీర్‌టీఎస్‌ రహదారిపై నిల్చుని మీద పెట్రోల్‌ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. మంటలు వ్యాపించడంతో అతడు రోడ్డుపై పరిగెడుతుంటే స్థానికులు బెంబేలెత్తిపోయారు. కాసేపటికి తేరుకున్న స్థానికులు, పోలీసులు మంటలు ఆర్పి అతన్ని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top