ఈ విజయానికి పునాది ఆ విజన్‌

ఈ విజయానికి పునాది ఆ విజన్‌


సమకాలీనం

జనవరి తొలివారం తిరుపతిలో జరిగిన ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ సదస్సులో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన విస్మయం కలిగించింది. తెలుగువారు నోబెల్‌ బహుమతి తెస్తే వంద కోట్లిస్తామని ప్రకటించారు. ‘నోబెల్‌ ఎలా సాధించాలి? ఏమైనా మెలకువలుంటే మా పిల్లలకి చెప్పండి’ అంటూ జపాన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత టకాకి కజిటాని కోరడంతో అంతా నవ్వుకున్నారు. తర్వాత యువశాస్త్రవేత్తల భేటీలో ఇదే విషయంపై పలు సందేహాలు, విమర్శలు తలెత్తాయి.విత్తొకటి వేస్తే చెట్టొకటి మొలుస్తుందా? మొలవదు. విత్తును బట్టే చెట్టు. కృషిని బట్టే ఫలితం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఘన విజయం ఒకటి రెండు రోజులో, నెలలో, సంవత్సరాల కష్టంతో లభిం చిన ఫలం కాదు. ఎడతెగని నాలుగున్నర దశాబ్దాలకు పైబడ్డ సమీకృత కృషికి దక్కిన ఫలితమిది. యావద్భారత జాతినే మహదానందపరచిన ఈ గెలుపు... అనేక ఆలోచనల, ఆచరణల సమ్మిళిత పరిణామం. ఒకే రాకెట్‌తో 104 ఉప గ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది మన ఇస్రో. ఈ ఘనతను విశ్వసమాజమే వేనోళ్ల పొగడుతోంది. దేశం గర్వంతో ఉప్పొంగుతోంది. ఇది అనితరసాధ్యమైన విజయమే! ఈ ఘనత సాధనకు మూలాలు పలువురు వ్యక్తుల కృషిలో, రాజనీతిజ్ఞుల దూరదృష్టిలో, స్ఫూర్తితో శాస్త్రవేత్తల్ని నడిపినోళ్ల నాయకత్వ లక్షణాల్లో, స్వదేశీ పరిజ్ఞానంతో స్వయంస మృద్ధి సాధించాలన్న తపనలో దాగి ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ.తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక సందర్భంలో ‘‘శాస్త్ర పరిజ్ఞానం తెచ్చిన పెనుమార్పులెన్నో! అయితే, అన్ని మార్పులూ మానవతకు మంచి చేసినవే కాకపోవచ్చు. కానీ, మనుషుల్లో కలిగించిన శాస్త్రీయ విశాల దృక్పథం, ఆలో చనా సరళి అన్నది శాస్త్రపరిజ్ఞానం తెచ్చిన ఆశావహమైన ఓ గొప్ప మార్పు’’ అన్న మాటలు అక్షర సత్యాలు. పాలకులీ విషయాలను గ్రహించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. శాస్త్రీయ పరిశోధనల్ని, అందుకు గల అవకా శాల్ని ప్రోత్సహించాలి. విత్తు విత్తిన వెంటనే ఫలాలు చేతికి అందనట్టే, ఇటు వంటి కృషికి తక్షణ ఫలితాలు రాకపోవచ్చు. దీర్ఘకాలంలో తప్పక ఫలిస్తాయి. రాజకీయ, అధికార వ్యవస్థలు తమ పాలనా ప్రక్రియల్లో దూరదృష్టితో వ్యవ హరించాల్సిన అవసరాన్ని తాజా విజయం నొక్కి చెప్పింది. పూర్వరంగంలో అయిదారు దశాబ్దాలకు పైబడి సాగిన కృషిని ఇస్రో ఘనత ధృవీకరించింది.ఓటమి నేర్పిన గెలుపు పాఠాలు

ప్రతి గెలుపు పరంపర సంపూర్ణ విజయంతోనే మొదలవాలని లేదు. నిబద్ధ తతో చేసే ప్రయత్నం కూడా గొప్పదే! ఒక ఓటమి నుంచి తేరుకొని గెలుపు పాఠాలు నేర్చిన వైవిధ్య అనుభవాలు ఇస్రోకూ ఉన్నాయి. 1969లో ఏర్పడ్డ ఇస్రో 1975లోనే తన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను విజయవంతంగా అంత రిక్షంలోకి పంపింది. 1981లో ‘ఆపిల్‌’ ఉపగ్రహాన్ని రాకెట్‌ వద్దకు చేర్చడానికి లోహరహిత వాహనం కావాల్సి వచ్చింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా పెద్ద వ్యయంతో అటువంటి వాహనాన్ని దిగుమతి చేసుకోలేని స్థితిలో ఎడ్ల బండిపై తీసుకెళ్లిన శైశవ దశ. 1987లో ఇస్రోలో చోటు చేసుకున్న ఓ పరి ణామం గురించి సీనియర్‌ జర్నలిస్ట్‌ భండారు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమంలో తాజాగా పెట్టిన ఒక వ్యాఖ్య విస్తృతంగా సంచరిస్తోంది. అదేం టంటే, ‘‘1987 మార్చి నెల. ఏఎస్‌ఎల్వీ–1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధమయింది. 31 గంటల కౌంట్‌డౌన్‌ కూడా పూర్తయింది. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ఏపీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్‌ డా.యు.ఆర్‌.రావు రెండంతస్తుల మిషన్‌ కంట్రోల్‌ రూం టెర్రస్‌ మీద నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనుల య్యారు.దేశానికి గర్వకారణం కాగల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు పది వేల మంది ప్రేక్షకుల గ్యాలరీలో, శ్రీహరికోట నివాస గృహాలపైనా వేచి ఉన్నారు. అనుకున్న సమయానికి రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. పైకి లేస్తుండగానే ఒకరికొకరు అభివాదాలు తెలుపు కుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగా ఉన్న సమయంలో జరగరా నిది జరిగిపోయింది. నిమిషం కూడా గడవకముందే రాకెట్‌ బంగాళాఖా తంలో కూలిపోయింది. భయంకర నిశ్శబ్దం, అందరి ముఖాల్లో ఆనందం కనుమరుగై, విషాదం అలుముకుంది. రాజీవ్‌గాంధీ అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందిని అనునయించారు. ‘ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాల్లో విజయాలే తప్ప అపజయాలుండవు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాల’ని ధైర్యం చెప్పారు. అప్పట్నుంచి అలా పోగుపడిన ధైర్యమే ఈరోజు ఇస్రో బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది’’ అని, ఆలిండియా రేడియోకు రిపో ర్టింగ్‌ చేస్తూ ఘటనా స్థలంలో ప్రత్యక్షసాక్షిగా ఉన్న అనుభవంతో రాశారా యన. ఈ కథనం ఓ అధినేత శాస్త్రీయ దృక్పథాన్ని, సద్యోచనను వెల్లడిస్తోంది.నెహ్రూ నెలకొల్పిన పునాదులపై.....

పాశ్చాత్య దేశాల ప్రభావంలో ఉంటుండే నెహ్రూ శాస్త్రీయ దృక్పథం దేశానికి ఎంతో మేలు చేసింది. మనలాంటి ఎదుగుతున్న దేశాలు జాతీయ స్థూలా దాయంలో కనీసం ఒక శాతమైనా శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలకు వెచ్చించాలనే వారాయన. శాస్త్ర–పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్‌ ఐఆర్‌), అణుశక్తి కమిషన్‌ (ఎఈసీ) వ్యవహారాల్లో తరచూ ప్రమేయం చూపే ఆయన పూనికతోనే జాతీయ శాస్త్ర విధానం, శాస్త్ర విధాన తీర్మానం సాధ్యమ య్యాయి. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తల్ని భారత్‌కు ఆహ్వానించి, తగు మార్గదర్శకత్వం నెరపమని కోరేవారు. బ్రిటన్‌ను వదిలి వచ్చి భారత్‌లో స్థిరపడ్డ ప్రఖ్యాత శాస్త్రవేత్త జేబీఎస్‌ హాల్దేన్, తానలా నిర్ణయించుకోవడానికి ప్రధాని నెహ్రూ శాస్త్రీయ దృక్పథమే కారణ మని వెల్లడించారు. నెహ్రూ హయాంలో క్యాబినెట్‌ శాస్త్రీయ సలహా సంఘ సమావేశాలు ఉత్తేజంగా, నిర్ణయాల అమలు నిజాయితీగా జరిగేదని సీనియర్‌ జర్నలిస్టు అనీస్‌ చిస్తీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు.1962 చైనా దూకుడు తర్వాత శాస్త్ర పరిశోధనలకు కేటాయించిన నిధుల్లోంచి కొంత రక్షణ శాఖకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. పదిశాతం అలా మళ్లించాలని చివరకు ఏకగ్రీవ నిర్ణయమూ జరిగింది. సరిగ్గా అప్పుడే నెహ్రూ అడ్డుకున్నారు. కావాలంటే, అక్కడే రక్షణకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలకు వెచ్చించండి తప్ప మళ్లింపు వలదని వారించారు. భారత్‌– పాక్‌ ఘర్షణల దరిమిలా కూడా ఇలాగే శాస్త్ర పరిశోధనల నిధుల్ని రక్షణకు మళ్లించాలన్న ప్రతిపాదన వచ్చింది. నెహ్రూ లేకపోయినా ఆయన సహచరుడు, భారత అణు కార్య క్రమాల పితామహుడు హోమి బాబా ఈసారి అడ్డుకొని మళ్లింపు లేకుండా చూశారు. 1963 ఆగస్టు 4న ఢిల్లీలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తల సదస్సును ప్రారంభిస్తూ నెహ్రూ ఒక గొప్ప మాట చెప్పారు. ‘సైన్స్‌ ఎంతో ముఖ్యమైంది. అంటే నా ఉద్దేశంలో కేవలం సాంకేతికమైన శాస్త్రం అన్న పరిమిత దృష్టిలో కాకుండా శాస్త్రీయ స్వభావమనే విస్తృతార్థంలో చూసినపుడు. ఎందుకంటే, ఈ సైన్స్‌ వల్ల గత అర్థ శతాబ్దిలో విశ్వవ్యాప్తంగా అనేక మార్పులొచ్చాయి. నేను– మీలో కొందరు ప్రత్యక్ష సాక్షులం, రాగల నాలుగయిదు దశాబ్దాల్లోనూ పెను మార్పులు రానున్నాయి. అంతరిక్షమనే కాదు, మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే అనేకాంశాల్లోనూ ఇది ఖాయం. అందుకు సంసిద్ధం కావాలంటే శాస్త్ర– సాంకేతిక రంగాల్లో మిమ్మల్ని మీరు నవీకరించుకోవాలి’ అన్నారు.అదే తరహాలో సాగిన పంథా

ఇందిరాగాంధీ హయాంలో అణుశక్తి కార్యక్రమాలైనా, అంతరిక్ష పరిశోధ నలైనా వ్యూహాత్మకంగా సాగాయి. తొలి పొక్రాన్‌ అణుపరీక్ష 1974లో జరి గింది. అణ్వాయుధం తయారు చేయబోమని, తమకా శక్తిసామర్థ్యాలు న్నా యని బయటి ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించడమే తమ లక్ష్యమనీ అప్పటి ప్రభుత్వం వెల్లడిం చింది. ఇస్రో ఏర్పాటు, విస్తరణ అన్నీ ఇందిర హయాంలో జరిగినవే! చైనా తన క్షిపణి పరిజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా సందేహించదగ్గ స్థాయిలో ఆయుధాలు పోగేస్తోందని రష్యా నుంచి అందిన రహస్య సమాచారం మేరకు భారత్‌ ప్రతిస్పందించింది. భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ విశేష సేవలందించారు. 1971లో ఆయన అకాల మరణం తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969–74) మధ్యంతర సమీక్షలో ఈ రంగం బడ్జెట్‌ను 15 నుంచి 53 కోట్లకు పెంచారు. అంతరిక్ష కార్యక్రమాలకు రక్షణ అవసరాలకు మధ్య ఓ సంబంధం ఉండాలని అప్పట్లో ఇందిర ఇస్రో చైర్మన్‌ ఎమ్జీకే మీనన్‌కు లేఖ రాశారు. తదనంతరం అక్కడ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ వ్యవహా రాల్లోనే కాకుండా తర్వాత ఇద్దరు ప్రధాన మంత్రుల వద్ద కూడా కీలక శాస్త్ర సలహాదారుగా దివంగత రాష్ట్రపతి డా‘‘ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ముఖ్యపాత్ర పోషించారు. 1996 ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు, నాటి ప్రధాని పీవీ నర్సింహారావు నుంచి కలామ్‌కు పిలుపొచ్చింది. అణుపరీక్షకు సర్వం సిద్ధం చేసుకోండని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి. అయినా, మరోమారు కలామ్‌ను పిలిపించి అప్పటికి ప్రధానిగా ఖరారైన (డెసిగ్నేటెడ్‌) అటల్‌బిహారీ వాజ్‌పేయి సమక్షంలోనే అణుపరీక్ష ప్రక్రియను కొనసాగించాల్సిందిగా కోరారు. పార్టీలకతీతంగా, విశాల జనహి తంతో పీవీ ఒక విధాన కార్యక్రమం జరిగేలా సానుకూలత కల్పించి రాజ నీతిజ్ఞత ప్రదర్శించారు. ఎన్డీయే ప్రభుత్వ ప్రధాని వాజ్‌పేయి కూడా అంతే స్ఫూర్తితో స్పందించారు. 1998 మే నెలలో పొక్రాన్‌ అణుపరీక్షలు నిర్వహించి శాస్త్రీయ దృక్పథంపై తమ నిబద్ధతను చాటారు.సంకుచిత, హస్వ్ర దృష్టితోనే ప్రమాదం

శాంతిస్వరూప్‌ భట్నాగర్, హోమి బాబా, సారాభాయ్, మీనన్, రాజా రామన్న, ఖొరానా, డా.చిదంబరం, యు.ఆర్‌.రావ్, అబ్దుల్‌ కలామ్, సతీష్‌ ధావన్, కస్తూరి రంగన్‌ వంటి మహామహులు శాస్త్ర భావనల్ని పెంపొం దించిన దేశమిది. దొంగదారులతో, తాత్కాలిక చర్యలతో శాస్త్రీయ రంగంలో కచ్చితమైన ఫలితాలు దక్కవు. ఇందుకు దూరదృష్టి, వ్యూహాత్మక అడుగులు, దీర్ఘకాలిక కృషి అవసరం. ట్విటర్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కటి భాష వాడినంత మాత్రాన శాస్త్రీయ భావనలు వృద్ధి చెందవు. భారత రాజ్యాంగంలోని 51 (ఎ) అధికరణంలో పేర్కొన్న పౌర బాధ్యతల్లో ‘శాస్త్రీయ స్వభావం’ పెంచుకోవాలని నిర్దేశం ఉంది. ఇందుకు ప్రభుత్వాలు, పాలకులు చోదకశక్తిగా దోహదపడాలి.జనవరి తొలివారం తిరుపతిలో జరిగిన ‘ఇండి యన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ సదస్సులో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన విస్మయం కలిగించింది. తెలుగువారు నోబెల్‌ బహుమతి తెస్తే వంద కోట్లిస్తామని ప్రకటించారు. ‘నోబెల్‌ ఎలా సాధించాలి? ఏమైనా మెలకువ లుంటే మా పిల్లలకి చెప్పండి’ అంటూ జపాన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత టకాకి కజిటాని కోరడంతో అంతా నవ్వుకున్నారు. తర్వాత యువశాస్త్రవేత్తల భేటీలో ఇదే విషయంపై పలు సందేహాలు, విమర్శలు తలె త్తాయి. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే భావనతో అనుచిత, అనారోగ్యకర పోటీని పెంచే తత్వం తప్ప మరోటి కాదు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రయోగశాలల్లేవు. ఉన్నచోటైనా పరికరాలు అలం కార ప్రాయమే! శాస్త్రీయ బోధన అంతంతే! రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నోబెల్‌ ఎలా ఆశిస్తారని వారు ప్రశ్నించారు. అవే వందకోట్లు మౌలిక సదుపాయాలకు వెచ్చించాలనే స్పృహ లేకుండా విద్యార్థుల్లో, యువతలో స్ఫూర్తి ఎలా కలిగిస్తారనేది ప్రశ్న. విద్యావకాశాలు, సదుపాయాలు, ప్రమాణాలు, సృజన.. ఇలా ఏ విషయంలో తీసుకున్నా దేశ సగటుకు దిగువన, అట్టడుగునున్న పరిస్థితుల్లో ఫలితాలు ప్రపంచస్థాయిలో ఉండాలనుకోవడం దురాశ! గౌతమ బుద్ధుడన్నట్టు దురాశ దుఃఖ కారణమే!(వ్యాసకర్త : దిలీప్‌ రెడ్డి

ఈమెయిల్‌: dileepreddy@sakshi.com )

Back to Top