ఇజ్రాయెల్‌కు అభిశంసన

ఇజ్రాయెల్‌కు అభిశంసన


పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేస్తున్న ఆవాసాలను నిలిపేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి శనివారం చేసిన తీర్మానం అనేక విధాల చరిత్రా త్మకమైనది. ద్రోన్‌లు, అపాచే హెలికాప్టర్లు, ఎఫ్‌–16 యుద్ధవిమానాలు వగైరాలను వినియోగించి పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ చేస్తున్న నెత్తుటి దాడులు కొత్త గాదు. అక్రమంగా, అడ్డగోలుగా, ఏకపక్షంగా పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమిం చుకోవడం, అక్కడ తమ పౌరులను ప్రవేశపెట్టడం ఇజ్రాయెల్‌ గత కొన్ని దశాబ్దా లుగా కొనసాగిస్తోంది. ఇలాంటి చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా హంతకదాడులకు పాల్పడటం, వందల సంఖ్యలో పాలస్తీనా పౌరులను పొట్టన బెట్టుకోవడం రివాజు. ఇజ్రాయెల్‌లో ఎవరు అధికారంలో ఉన్నా, ఎన్నికలొచ్చే ముందు పాలస్తీనా ప్రాంతాలపై మిలిటెంట్ల సాకుతోనో, మరే ఇతర కారణంతోనో బాంబు దాడులకు పాల్పడటం సర్వసాధారణం. పాలస్తీనా పౌరుల కదలికలపై ఆంక్షలు పెట్టడం ఇజ్రాయెల్‌ అమలు చేస్తున్న దమననీతి.భద్రతామండలిలో ఈ ఆగడాలను ఖండిస్తూ తీర్మానాలు వచ్చినప్పుడల్లా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకుని నీరుగార్చే అమెరికా... తొలిసారి ఓటింగ్‌కు గైర్హాజరై ఆ తీర్మానం నెగ్గడానికి దోహదపడింది. తన చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్‌కు ఆగ్రహం తెప్పిం చింది. గత 40 ఏళ్లలో ఇజ్రాయెల్‌ అక్రమ ఆవాసాలను భద్రతామండలి వ్యతిరేకిం చడం, ఆ దేశాన్ని అభిశంసించడం ఇదే తొలిసారి. అధికార పీఠంనుంచి మరికొన్ని రోజుల్లో దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీసుకున్న సరికొత్త వైఖరి ఫలితంగా ఇది సాధ్యమైంది. అలాగని ఇజ్రాయెల్‌ అక్రమ ఆవాసాలను అమెరికా గతంలో వ్యతిరేకించకపోలేదు. అయితే అలాంటి వివాదాలను ఆ రెండు పక్షాలు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప అంతర్జాతీయ వేదిక లపై వాటిని లేవనెత్తడం సరికాదని సుద్దులు చెప్పేది. ఆ రకంగా భద్రతామండలి అభిశంసనకు గురికాకుండా ఇజ్రాయెల్‌ను ఎప్పటికప్పుడు తప్పించేది. ఇప్పుడలా చేయపోవడానికి అమెరికా కారణాలు అమెరికాకున్నాయి.ఒబామా పదవీకాలంలో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు తలెత్తినా అమెరికా–ఇజ్రా యెల్‌ సంబంధాలు పాత ఒరవడిలోనే కొనసాగాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం యధాతథంగానే... చెప్పాలంటే గతంతో పోలిస్తే ముమ్మరంగానే అందింది. ఇజ్రాయెల్‌ను అభిశంసించే భద్రతామండలి తీర్మానాలను అమెరికా క్రమం తప్ప కుండా వీటో చేసింది. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌పై నాలుగేళ్లక్రితం ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు నిప్పుల వాన కురిపించి దాదాపు 120మందిని పొట్టన బెట్టుకున్నప్పుడు సైతం ఒబామా ఇజ్రాయెల్‌ను వెనకేసుకొచ్చారు. ఆ దాడులు ‘ఆత్మరక్షణ’ కోసం చేస్తున్నవేనని సమర్ధించారు. ఇజ్రాయెల్‌ను అభిశంసించే తీర్మానాన్ని వీగిపోయేలా చేశారు. కానీ ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకున్నాక ఇజ్రాయెల్‌ బాహాటంగా ఆ చర్యను విమర్శించింది. ఇజ్రాయెల్‌ ప్రధానిగా ఎన్నిక కావడానికి ముందు అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి నిరుడు ప్రసంగించిన నెటన్యాహూ ఒబామాను తీవ్రంగా దుయ్యబట్టారు. పశ్చిమాసియాను ధ్వంసం చేసే ప్రమాదకర క్రీడకు అమె రికా తెరలేపిందని విమర్శించారు. అప్పటినుంచీ ఇరు దేశాలమధ్యా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి.ఇజ్రాయెల్‌కూ, ప్రత్యేకించి నెటన్యాహూకు ‘తగిన జవాబి’వ్వాలని ఒబామా పట్టుదలగా ఉన్నారు. అది ఈ రూపంలో ఆయన నెరవేర్చు కున్నారు. దీనికితోడు ఈ వ్యవహారంలో కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం కూడా ఒబామాకు ఆగ్రహం కలిగించింది. ప్రతి అంశంలోనూ విపరీత ధోరణిని ప్రద ర్శించే ట్రంప్‌ ఇజ్రాయెల్‌–పాలస్తీనా అంశంలో కూడా ఆ బాణీనే పాటిస్తున్నారు. తీర్మానం ప్రతిపాదక దేశాల్లో ఒకటైన ఈజిప్టును ట్రంప్‌ వెనక్కి తగ్గేలా చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ఫతా అల్‌ సిసికి ఫోన్‌ చేసి తీర్మానం ప్రతిపాదన నుంచి విరమించుకునేలా ఒప్పించారు. ఓటింగ్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని కోరేలా చేశారు. అయితే తీర్మానాన్ని ప్రతిపాదించిన ఇతర దేశాలు మలేసియా, న్యూజిలాండ్, సెనెగెల్, వెని జులా మాత్రం ఓటింగ్‌ జరగాలని పట్టుబట్టాయి. ఇది ఆగేలా లేదని గ్రహించిన ట్రంప్‌ అమెరికా ఎప్పటిలా వీటో చేయాలని పిలుపునిచ్చారు.  వచ్చే నెల 20న అధ్యక్ష పదవి చేపట్టాల్సి ఉండగా ఈలోగానే తన పెత్తనం సాగాలని, విదేశాంగ విధానం తాను కోరుకున్నట్టు నడవాలని ట్రంప్‌ భావించారు. పర్యవసానంగా ఆయనకు ఝలక్‌ ఇవ్వాలని ఒబామా నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది.అయితే ఇంతమాత్రాన పాలస్తీనాకు ఒరిగేదేమి లేదు. ఇజ్రాయెల్‌ దుర్మార్గం నుంచి అది ఇప్పట్లో తప్పించుకోవడమూ సాధ్యం కాదు. అధ్యక్ష పదవి చేపట్ట బోతున్న ట్రంప్‌ జరిగిన పరిణామాలపై ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నారు. తన అనుచరగణంలో అతి మితవాదిగా పేరొందిన డేవిడ్‌ ఫ్రైడ్‌మాన్‌ను ఇజ్రాయెల్‌కు రాయబారిగా పంపుతున్నట్టు చెప్పడమే కాదు... అమెరికా రాయబార కార్యాల యాన్ని ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు మారుస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేటట్లయితే పరిష్కారం కావాల్సిన వివాదాస్పద భూభాగంలో జెరూసలేం కూడా ఉంది. ఆ నగరాన్ని ఇజ్రా యెల్‌ రాజధానిగా ప్రకటించుకున్నా దానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు టెల్‌అవీవ్‌లోనే ఉంటాయి.ఈ నేపథ్యంలో జెరూసలేంకు మారుస్తాననడంలో ట్రంప్‌ తెంపరితనం వెల్లడవుతుంది. పాలస్తీనా పౌరుల కనీస మానవహక్కులను కాలరాయడమే కాదు... జాత్యహంకారాన్ని, ఇస్లాం వ్యతిరేకతను పెంచి పోషిస్తున్న ఇజ్రాయెల్‌ను కట్టడి చేయాలంటే ఒబామా స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న చర్య, భద్రతామండలి అభిశంసన మాత్రమే సరిపోవు. వీటి ప్రాతిపదికగా ఇజ్రాయెల్‌ ఆగడాలపై అంతర్జాతీయంగా ప్రజాభిప్రాయాన్ని బలంగా కూడగట్టగలిగినప్పుడే పాలస్తీనా ప్రజలకు న్యాయం దక్కుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోనట్టయితే పాలస్తీనాలో ప్రతిఘటన మరింత పెరుగుతుంది. అదే జరిగితే పశ్చిమాసియా ప్రాంతం మరింత అల్లకల్లోలంగా, అస్థిరంగా మిగులుతుంది. అది మంచిది కాదు.

 

Back to Top