వాట్సప్‌లో వీడియో.. 12మంది భవిష్యత్‌?

వాట్సప్‌లో వీడియో.. 12మంది భవిష్యత్‌?


రాజ్‌కోట్‌: అసలే శిక్షణలో ఉన్న పోలీసులు.. ఆపై ప్రభుత్వ వాహనం.. ఎక్కడో దూరంగా ఉన్న చోటుకు వెళ్లి వాహనంలోనే కూర్చుని మందు తాగారు. ఈ విషయం బయటకు పొక్కటంతో అధికారులు విచారణకు ఆదేశించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో 12 మంది పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ పొందుతున్నారు. అయితే, గుజరాత్‌ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉండగా పక్కనే 225 కిలోమీటర్ల దూరంలోని కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో ఆంక్షలేమీ లేవు.దీంతో రాజ్‌కోట్‌లో శిక్షణ పొందుతున్న పోలీసులు ప్రభుత్వ వాహనంలోనే డయ్యూ వెళ్లారు. అక్కడ మద్యం దుకాణంలో మందుబాటిళ్లు కొనుగోలు చేశారు. ఓ హోటల్‌ సమీపంలో రోడ్డు పక్కనే వాహనం ఆపుచేసి, అందులోనే కూర్చుని మందు తాగారు. అయితే, ఎవరో ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇటువంటి చర్యలు తీవ్ర క్షమశిక్షణ ఉల్లంఘనకు వస్తాయని, బాధ్యులపై కఠిన చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణకు ప్రత్యేక అధికారిని నియమించారు. ట్రైనింగ్‌లో ఉన్న పోలీసులు అంతదూరంలో ఉన్న డయ్యూ వరకు ఎలా వెళ్లారనే దానిపైనా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

Back to Top