నిండు ప్రాణాలు బలిగొన్న వన్‌సైడ్‌ లవ్‌

ధరణి (ఫైల్)


సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ ప్రేమోన్మాది వన్‌సైడ్‌ లవ్‌ ఒక అమాయక విద్యార్థిని నిండు ప్రాణాలను బలికొంది. తనకు దక్కని యువతి ఎవరికీ దక్కకూడదనే ఉక్రోషంతో ఆమె గొంతుకోసి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపం అడుత్తకుడి గ్రామానికి చెందిన పళనిస్వామి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి, కుమార్తె ధరణి (19) గ్రామంలో ఉంటున్నారు. శివగంగై జిల్లా మహిళా కళాశాలలో ధరణి బీఏ ఫస్టియర్‌ చదువుతోంది. వీరి పొరుగింటిలో నివసించే బంధువు సేతురామన్‌ కుమారుడు కుమార్‌ (29) చెన్నైలో లెదర్‌ సంచులు కుడుతూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా ధరణిపై ప్రేమ పెంచుకున్న కుమార్‌ తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఆరు నెలల క్రితం తన బంధువులతో కలిసి ధరణి ఇంటికి వెళ్లి సంబంధం కోరాడు. కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ధరణి తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తరువాత పదే పదే ధరణి వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి గొడవ పడేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా ధరణి తల్లి, అన్న కలిసి కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా, ధరణి తల్లి మహేశ్వరి, అన్న ధర్మలింగం ఆదివారం ఊరికి వెళ్లగా, కాలేజీకి సెలవు కావడంతో పెరటి తలుపును తెరచి ఉంచి ధరణి ఇంటిలో ఒంటరిగా నిద్రించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుమార్‌ ఇంట్లోకి చొరబడి తలుపులకు లోపలి నుంచి తాళం వేశాడు. అనంతరం టీవీ ఆన్‌ చేసి వాల్యూమ్‌ పెద్దగా పెంచాడు. ఇంతలో ధరణి మేల్కోగా కుమార్‌ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో  విచక్షణా రహితంగా ఆమె గొంతు నరికివేయడంతో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది.

Back to Top