ఆమె ఖాతాలో 95 వేల కోట్లు!

ఆమె ఖాతాలో 95 వేల కోట్లు!


కాన్పూర్: ఆమె పేదరాలు. ఉన్నట్టుండి రూ. 95 వేల కోట్లు ఆమె బ్యాంకు ఖాతాలోకి చేరిపోయాయి. ఆమె నోరెళ్లబెట్టింది. ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపు ఆ కోట్ల డబ్బంతా ఖాతాలోంచి వెళ్లిపోయింది. లేనిపోని ఆశలు కల్పించి నీరుగార్చిన ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఊర్మిళ అనే పేదరాలు ఇటీవల జన్‌ధన్ యోజన పథకం కింద రూ. 2వేలతో యూపీఎస్‌ఐడీసీ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఖాతా తెరిచింది. కొన్ని రోజుల కిందట ఆమె ఫోన్‌కు రెండు మెసేజ్‌లు వచ్చాయి.



ఖాతాలో రూ. 9,99,999 జమ అయ్యాయని ఒక మెసేజ్‌లో, రూ.9.7 లక్షలు డెబిట్ కావడంతో ఖాతాలో రూ. 2 వేలు ఉన్నాయని మరో మెసేజ్‌లో ఉంది. ఇంత భారీ డబ్బు తన ఖాతాలోకి రావడం, పోవడంతో ఆమె నమ్మలేకపోయింది. ఖాతా తెరిచేటప్పుడు తనకు పూచీ ఇచ్చిన లల్తా తివారీతో కలసి బ్యాంకుకు వెళ్లి ఆరా తీసింది.



సిబ్బంది ఆమె ఖాతా తనిఖీ చేయగా అందులో రూ.95 వేల కోట్ల మొత్తం కనిపించింది. ఆశ్చర్యం, సంతోషంతో ఊర్మిళకు గుండెపోటు వచ్చినంత పనయ్యింది. దీనిపై అక్కడి క్లర్కు వివరణ ఇచ్చాడు. ఊర్మిళ ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం లేదని, దాంతో ఖాతా నిర్వహణకు వీలుగా ఆ భారీ మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. తర్వాత వివాదం తలెత్తకుండా రూ. 95 వేల కోట్లను ఆమె ఖాతా నుంచి తీసేసి వాస్తవానికి ఉండాల్సిన రూ. 2 వేలు జమ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top